చోడవరం: గోవాడ సుగర్స్ క్రషింగ్‌కు మళ్లీ అంతరాయం కలిగింది. బాయిలర్ హౌస్‌లో సమస్య తలెత్తడంతో ఆదివారం క్రషింగ్ నిలిచిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, కార్మికుల సమ్మెలతో ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభించడమే ఆలస్యంగా జరిగింది. ఇప్పటికే అనేక సార్లు బెగాస్ కొరత, బాయిలర్ హౌస్‌లో సమస్యలతో క్రషింగ్‌కు అంతరాయం కలుగగా మరలా బాయిలర్ ఈటీపీ ప్లాంట్‌లో సమస్య తలెత్తడంతో మరోసారి క్రషింగ్ నిలిచిపోయింది. రాత్రి అయినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదిలావుండగా క్రషింగ్ నిలిచిపోవడంతో మరలా యథావిధిగా ఫ్యాక్టరీ యార్డుల వద్ద చెరకు కాటాల వద్ద పెద్ద సంఖ్యలో చెరకు లోడుతో వాహనాలు నిలిచిపోయాయి. తరుచూ ఉత్పన్నమౌతున్న అంతరాయం సమస్యతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు లేక క్రషింగ్ ఆశించిన మేర జరగదని ముందు భావించినప్పటికీ చెరకు పుష్కలంగా సరఫరా అవుతుండడంతో ఇప్పటికే 80వేల టన్నులు దాటి క్రషింగ్ కూడా జోరుగానే సాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలో తరుచూ మరమ్మతుల సమస్యలు తలెత్తుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.