
ఉపాధి కూలీలపై రాజకీయ కక్ష, వివక్ష
నీలిగుంటలో ఉపాధి పని కల్పించలేదని ఆరోపిస్తున్న కూలీలు
కోటవురట్ల: కూటమి ప్రభుత్వంలో ఉపాధి కూలీలపై రాజకీయ కక్ష, వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. లింగాపురంలో పలువురు కూటమి కార్యకర్తలకు పనికి రాకుండానే మస్తర్లు పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నీలిగుంటలో టీడీపీ కార్యకర్తలు ఉన్న గ్రూపులకు మాత్రమే పని కల్పించారంటూ కూలీలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలిగుంట, శివారు గ్రామం సన్యాసిరాజుపాలెంలో మొత్తం 18 గ్రూపులు ఉండగా అందులో ఏరికోరి టీడీపీ కార్యకర్తలున్న 4 గ్రూపులకు మాత్రమే పని కల్పించారని కూలీలు ఆరోపించారు. తమకు పని ఎందుకు కల్పించరంటూ ఉపాధి సిబ్బందిని ప్రశ్నించారు. సర్పంచ్ వరహాలబాబు మాట్లాడుతూ కూలీలపై రాజకీయం రుద్ది, పనుల కల్పనలో వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా మండల సర్వ సభ్య సమావేశంలో ఇదే అంశంపై అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా ఉపాధి సిబ్బంది పనితీరు మారలేదని ఆరోపించారు. వెంటనే అన్ని గ్రూపులకు పని కల్పించకపోతే కూలీలతో మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.