
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?
● పూడిమడక రోడ్డులో భారీ వాహనాలను కట్టడి చేయాలి ● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన
మునగపాక : తరచూ పూడిమడక రోడ్డులో భారీ వాహానాల (క్వారీ లారీల) రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఽఈ మార్గంలో అధికలోడులతో వాహనాలు ప్రయాణిస్తున్నాయన్నారు. అధికారుల ఉదాసీనత తగదంటూ మండిపడ్డారు. సోమవారం మునగపాక రెవెన్యూ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. రాంబిల్లిలోని నేవల్‌బేస్ నిర్మాణంలో భాగంగా పరిమితికి మించి భారీ బండరాళ్లతో లారీలు తిరగడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పగలు,రాత్రి తేడా లేకుండా వాహనాలు విచ్చల విడిగా తిరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఇటీవల కాలంలో పూడిమడక రోడ్డులో భారీ వాహనాల కారణంగా కొంతమంది మృత్యువాతకు గురికావడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు. వాహన డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఈ విషయమై అచ్యుతాపురం, మునగపాక మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి గత ఏడాది నవంబర్ 4వతేదీన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌కు వినతి అందజేసినా ఫలితం కనిపించలేదన్నారు. తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలని లేకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.ఆదిమహేశ్వరరావుకు వినతి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ నేతలు మారిశెట్టి సూర్యనారాయణ, మలసాల కిషోర్,దాసరి అప్పారావు, మళ్ల సంజీవరావు, నరాలశెట్టి సూర్యనారాయణ, ఆడారి కాశీబాబు, దిమ్మల అప్పారావు, కోనపల్లి రామ్మోహనరావు, కాండ్రేగుల జగన్, ఈత బాబూరావు, నాగేశ్వరరావు, పెదబ్బాయి, బొడ్డేడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?