దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి రెవెన్యూ పరిధిలోని దుబిరెడ్డి బందతో పాటు చెరువు వాగులో అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సదరు ఆక్రమణ స్థలంలో నిర్మించిన వైన్ షాపు తదితర నిర్మాణాల ఎదుట వి.సంతపాలెం, గుడిపాల, నీలకంఠరాజుపురం, జమ్మాదేవిపేట, ఆనందపురం, పోతనవలస, ఉగ్గినవలస, కృష్ణారాయుడుపేట తదితర గ్రామాల రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి తప్పుడు రికార్డులను సృష్టించారని వేచలపూడి అగ్రహానికి చెందిన వేపాడ మాజీ ఎంపీపీ వేచలపు చినరామునాయుడు ఆరోపించారు. రాజుగారి చెరువు నుంచి దుబిరెడ్డి బందకు ఇరువైపులా నీరు వెళ్లేందుకు గతంలో నిర్మించిన మదుములను కబ్జా చేశారన్నారు. చెరువు పక్కన ఉన్న గోర్జు అన్యాక్రాంతం చేశారన్నారు. రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులతో కుమ్మక్కవ్వడంతో పలు గ్రామాలకు చెందిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.ఆందోళనలో వి.ఎస్.నాయుడు, బోజంకి అచ్యుతరామయ్య, సూర్యనారాయణ, చిరికి వెంకటరమణ, సింహాద్రప్పడు పాల్గొన్నారు.
‘ఆరోపణలు నిరాధారం’
ముషిడిపల్లికి చెందిన సర్వసిద్ది నాగేశ్వరరావు నుంచి 2013లో శ్రీకాకుళానికి చెందిన మహిళ జహర్న్‌ఖాన్ సర్వే నెంబర్ 580–2లో గల 30 సెంట్ల భూమిని కొనుగోలు చేయగా ఆమె నుంచి తాము 2022లో కొనుగోలు చేసినట్టు సోమిరెడ్డి గోవింద, గండి దేవి వివరణ ఇచ్చారు. దీనిపై రైతులు ఆర్డీవో కోర్టులో అప్పీలుకెళ్లగా విచారణ అనంతరం తిరస్కరించారన్నారు. ఆ తర్వాత 8 మంది రైతుల మీద తాము చోడవరం కోర్టుకి వెళ్లగా ఆ భూమిపై తాము తప్ప ఇతరులెవరూ వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం తాము భూమిని కొనుగోలు చేసుకుంటే, కొందరు రైతులను రెచ్చకొట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.