ఎవరు అంతమొందించారో..
కశింకోట మండలం బయ్యవరంలో సంచలనం
కశింకోట: ఆ మహిళకు సుమారు 35 ఏళ్ల వయసు ఉండవచ్చు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఆమె వివాహిత అని చెప్పకనే చెబుతున్నాయి.. కొద్ది గంటల క్రితమే హత్య జరిగి ఉండవచ్చని వైద్యులు ధ్రువీకరించారు.. కశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభిప్రాయం ప్రకారం.. సోమవారం రాత్రి మహిళను హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా కోసి మూటగట్టి సోమవారం రాత్రి తెచ్చి ఇక్కడ పడేసి ఉంటారు. సీఐ అల్లు స్వామినాయుడు తదితర సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని ఆమె సందర్శించారు. మృతురాలి శరీర భాగాలపై వస్త్రాలు గాని, మరే ఆధారాలుగాని లేవు. గాజులు, మట్టెలు మాత్రం దొరికాయి. మిగిలిన మృతదేహ భాగం లభ్యమయితే తప్ప ఎవరో గుర్తించే అవకాశం లేదు. అయితే కాలి భాగంలో ఒక పుట్టు మచ్చ ఉంది. మిగిలిన శరీర భాగాన్ని మరోచోట పడేయడం గాని, పూడ్చి వేయడం గాని చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసు జాగిలం యలమంచిలి మార్గం వైపు వెళ్లింది. మృతదేహం శరీర భాగాలను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు.
8 ప్రత్యేక బృందాల ఏర్పాటు
మహిళ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. సీసీ టీవీ పుటేజి, స్థానికుల సమాచారాన్ని విశ్లేషించి నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఏ విధమైన సమాచారంగాని, అద్యశ్యమైన మహిళల వివరాలు గాని తెలిసిన వారు తక్షణమే పోలీసు అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. కశింకోట సీఐ అల్లు స్వామినాయుడు సెల్ నెంబర్ 9440796088కు గాని, 100, 112 నెంబర్లకు గాని సమాచారాన్ని తెలియజేయాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు విజయకుమార్, అశోక్‌కుమార్, కోటేశ్వరరావు, పైడపు నాయుడు, అప్పలరాజు, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.
మూటలో మహిళ శరీర భాగాలు
మూటలో మహిళ శరీర భాగాలు
మూటలో మహిళ శరీర భాగాలు