కశింకోట: మండలంలోని కన్నూరుపాలెంలో భర్త, అత్తమామల వరకట్న వేధింపులు భరించలేక బావిలో పడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సీఐ అల్లు స్వామినాయుడు బుధవారం రాత్రి అందించిన వివరాలివి. కన్నురుపాలేనికి చెందిన పెయింటర్ గులిమి శివకు, గాజువాకకు చెందిన కుసుమ (25)కు 2019 ఫిబ్రవరి 13న వివాహం జరిగింది. ఆమెకు వివాహ సమయంలో రూ.2.50 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు, బైక్ కట్నంగా ఇచ్చారు. వివాహం అనంతరం వారికి చరణ్ తేజ(5), యోక్సో వర్థన్ (3) జన్మించారు. అయితే కొంత కాలంగా భర్త శివ, అత్త అమరావతి, మామ శ్రీనివాస్, బావ రామకృష్ణలు కలిసి రూ.లక్ష అదనపు కట్నం కోసం తరచుగా వేధిస్తూ మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. వీటిని తాళలేక మంగళవారం సాయంత్రం కుసుమ సమీపంలోని బావిలో పడి మృతి చెందింది. ఈ మేరకు తండ్రి గోలుకొండ కొండబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు. ఇదిలా ఉండగా తన కుమార్తె కుసుమను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించి చంపేసారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ వద్ద తల్లి నాగమణి రోధించగా బంధువులు ఓదార్చారు.