● స్పీకర్, ఎంపీ స్పందించాలి ● సీపీఎం నాయకుల డిమాండ్
మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు అడిగర్ల రాజు
నర్సీపట్నం: లేటరైట్ తవ్వకాలపై వస్తున్న వార్త కథనాలపై కూటమి వైఖరి వెల్లడించాలని సీపీఎం నాయకుడు అడిగర్ల రాజు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాతవరం మండలం, సుందరకోట పంచాయతీ భమిడికలొద్దులో లేటరైట్ తవ్వకాలకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేష్ దీనిపై స్పందించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేటరైట్ తవ్వకాలు, అక్రమాలపై ప్రశ్నించిన కూటమి నేతలు నేడు స్పందించాలన్నారు. అధికారంలో ఉన్న కూటమి నేతలు గిరిజనుల మనుగడకు, పర్యావరణానికి ప్రమాదం తలపెట్టే లేటరైట్ తవ్వకాలను వ్యతిరేకించి ప్రజ ల పక్షాన నిలబడాలన్నారు. బినామీల పేరున ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయించాలన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి లేటరైట్ తవ్వకాలకు పాల్పడడం తగదన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు. లేటరైట్ పేరుతో గిరిజను ల మనుగడకు విఘాతం కలిగిస్తే ప్రజల తరుపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు చిరంజీవి పాల్గొన్నారు.