● ఇద్దరికి తీవ్ర గాయాలు
రావికమతం : పొలం మధ్యలోని పంటను ట్రాక్టర్‌తో తొక్కించుకెళ్లి పాడు చేయడంపై రైతుల మధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన రైతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాలివి. మేడివాడకు చెందిన కేశంశెట్టి గణేష్, సీతిన చిరంజీవికి చెందిన వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. గురువారం సీతిన చిరంజీవికి చెందిన ట్రాక్టర్‌ను కేశంశెట్టి గణేష్ పొలంలోంచి తీసుకెళ్లి దాంట్లోని పంటను పాడు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీతిన చిరంజీవి, సీతిన సంజీవి, సీతిన శ్రీను కర్రలు, కత్తులతో గణేష్, అతడి సోదరుడు శేషుబాబుపై దాడి చేశారు. ఈ దాడిలో గణేష్, శేషుబాబు తలపై బలమైన గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ రావికమతం పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. చిరంజీవి, అతని సోదరులుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు.