అనకాపల్లి టౌన్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఆమోదించాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ సలహాదారు పి.ఎస్.అజయ్ కుమార్ అన్నారు. స్ధానిక మెయిన్‌రోడ్ న్యాయస్ధానాల సముదాయం వద్ద తమ డిమాండ్లు ఆమోదించాలని శుక్రవారం పలువురు లాయర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల చట్టాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. 2022 జూలై నెలలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదుల రక్షణ బిల్లు ముసాయిదాను తయారుచేసి రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వాలకు పంపించిందన్నారు. ఈ ముసాయిదా బిల్లు ఆధారం చేసుకొని రాజస్ధాన్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలు రూపొందించాయని, ఏపీ శాసనసభలో కూడా వెంటనే చట్టంగా మార్చాలని అన్నారు. సీనియర్ న్యాయవాది ఐఆర్ గంగాధర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శేఖరమంత్రి సాయి లక్షణ్‌రావులు మాట్లాడుతూ దళిత బహుజన సామాజిక వర్గాలు, ఆదివాసీలు, మహిళల నుంచి న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని ఈ రక్షణ చట్టం వారి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు.