మునగపాక : పూడిమడక రోడ్డు విస్తరణకు సంబంధించి పరిహారంగా నగదు అందించాలని, అంతే కాని టీడీఆర్ బాండ్లు తమ కొద్దంటూ శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. గ్రామసభలు నిర్వహించి ప్రతి బాధితునికి తమ అకౌంట్‌లో పరిహారం జమ అవుతుందని చెప్పి నేడు టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ చెప్పడం తగదన్నారు. సీఐటీయూ నేత బ్రహ్మాజీ మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణలో ఇళ్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్న వారికి చట్ట ప్రకారం పరిహారం అందిస్తామని అధికారులు చెప్పారన్నారు. అభివృద్ధికి తాము అడ్డంకి కాదని, ప్రభుత్వ పరిహారం మాత్రం నగదు రూపంలో అందించాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఆదిమహేశ్వరరావుకు వినతి అందజేశారు.