యలమంచిలి పట్టణ బడ్జెట్‌ రూ.11.94 కోట్లు | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి పట్టణ బడ్జెట్‌ రూ.11.94 కోట్లు

Mar 26 2025 1:45 AM | Updated on Mar 26 2025 1:43 AM

నిధులు వృథా అవుతున్నా పట్టదా? 10వ వార్డులో అనధికార నిర్మాణాలపై చర్యలేవీ... కౌన్సిల్‌ సమావేశంలో నిలదీసిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు

యలమంచిలి రూరల్‌ : పురపాలక సంఘం 2025–26 సంవత్సరం బడ్జెట్‌ను రూ.11.94 కోట్ల అంచనాలతో కౌన్సిల్‌ సభ్యులు ఆమోదించారు. మంగళవారం ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి అధ్యక్షతన మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన 50వ పాలకవర్గ సమావేశంలో కమిషనర్‌ బి.జె.ఎస్‌ ప్రసాదరాజు, వివిధ విభాగాల అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. 2024–25 బడ్జెట్‌ అంచనాలు, సవరణలు,2025–26 ఏడాది అంచనాలను సభ ముందుంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగులు నిధులు రూ.41.88 లక్షలు చూపించగా, వచ్చే సంవత్సరానికి రూ.47.06 లక్షలు మిగులు అంచనాగా చూపించారు. బడ్జెట్‌లో ప్రారంభ నిల్వ రూ.11,94,69,321, జమలు రూ.9,41,38,500, ఖర్చులు రూ.8,07,02,000గా చూపించారు. వార్షిక బడ్జెట్‌లోని అంకెలు, వివరాలు అర్థం కాక సభ్యులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అంతకుముందు 19 అంశాలతో కూడిన సాధారణ అజెండాతో పాటు 6 అంశాలతో ఉన్న అత్యవసర సమావేశపు అజెండాను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 6వ అంశంలో పేర్కొన్న విధంగా మాజీ సైనికోద్యోగుల ఇళ్లకు ఆస్తి పన్ను రాయితీపై వైస్‌ ఛైర్మన్‌ బెజవాడ నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు మాజీ సైనికోద్యోగులు ఆస్తి పన్ను రాయితీ పొంది భవనాలను అద్దెకు ఇచ్చుకుంటూ ఆదాయం పొందుతున్నారన్నారు. దీనిపై వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఛైర్‌పర్సన్‌ రమాకుమారి ఆదేశించారు.

వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రస్తావించిన అంశాలు

●గతంలో పురపాలక సంఘ కార్యాలయానికి సౌర విద్యుత్‌ అందించడానికి లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన సోలార్‌ ప్యానెళ్లు కార్యాలయం పైన నిరుపయోగంగా ఉన్నాయని, ఈ విషయంపై ఇప్పటికి పలుసార్లు పాలకవర్గ సమావేశాల్లో ప్రస్తావించినా అధికారులు పట్టించుకోలేదని వైస్‌ చైర్మన్‌ అర్రెపు గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

●దిమిలి రోడ్డు కూడలి వద్ద కూరగాయల మార్కెట్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డు వేసుకుని వ్యాపారం చేసుకుంటూ మున్సిపాలిటీకి పన్ను కట్టడం లేదని మరో వైస్‌ చైర్మన్‌ బెజవాడ నాగేశ్వరరావు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల వసూళ్లపై ప్రస్తావించారు. 66 అసెస్మెంట్లకు సుమారు రూ.కోటి వరకు బకాయి ఉందని రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు.

●ఐదేళ్ల క్రితం మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలు నిర్మాణానికి రూ.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినా ఇప్పటివరకు ఆ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని, గతంలో 8 సార్లు ఈ విషయంపై సమావేశాల్లో ప్రస్తావించినా అధికారులు పట్టించుకోలేదని, ప్రతిసారీ సమావేశం నిర్వహించడానికి నెలకు రూ.6 వేలు చొప్పున ఏడాదికి రూ.72 వేలు వృథా చేస్తున్నారని వైస్‌ ఛైర్మన్‌ గుప్తా మండిపడ్డారు.

●మర్రిబంద జగనన్న కాలనీలో ఇళ్లన్నీ పట్టణానికి చెందిన వారికే ఇచ్చామని అక్కడ నీటి సరఫరా జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ సభ్యులు లేవనెత్తారు.

–రోజువారీ, వారపు సంత, పశువుల మార్కెట్‌, మేకల కమేళాలకు సంబంధించి ఆశీలు వసూళ్లకు వేలం పాట నిర్వహణకు సంబంధించి సరైన ప్రచారం చేయకుండా పాటదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రామారాయుడుపాలెం వార్డు కౌన్సిలర్‌ సుంకర మరిణేశ్వర్రావు ఆరోపించారు. అశీలు వసూళ్లకు సంబంధించిన వేలంపాట సమాచారం ఏఏ పత్రికల్లో ప్రకటన ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

●ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో నిర్మించిన కొన్ని దుకాణాలకు ఆస్తి పన్ను విధించలేదని, ఆదాయం కోల్పోతున్నా పట్టదా..అని వైస్‌ చైర్మన్‌ బెజవాడ నిలదీశారు.

●10 వార్డులో అనధికార కట్టడాలు, అంతస్తుల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆ వార్డు సభ్యురాలు మంజేటి సరోజిని అధికారులను నిలదీశారు. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్‌ స్పష్టం చేశారు.

యలమంచిలి పట్టణ బడ్జెట్‌ రూ.11.94 కోట్లు 1
1/2

యలమంచిలి పట్టణ బడ్జెట్‌ రూ.11.94 కోట్లు

యలమంచిలి పట్టణ బడ్జెట్‌ రూ.11.94 కోట్లు 2
2/2

యలమంచిలి పట్టణ బడ్జెట్‌ రూ.11.94 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement