హామీలు నెరవేర్చే వరకూ పోరాడుతాం.. | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చే వరకూ పోరాడుతాం..

Mar 26 2025 1:45 AM | Updated on Mar 26 2025 1:43 AM

● ఉద్యోగాలు, భృతి బూటకంగా మారాయి ● ఉన్న పరిశ్రమలే వెనక్కి పోతున్నాయి ● త్వరలో మండల, గ్రామ స్థాయిలో యువజన విభాగం కమిటీల ఏర్పాటు ● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా

సాక్షి, విశాఖపట్నం : ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలన్నీ అమలుచేసే వరకూ వైఎస్సార్‌ సీపీ పోరాడుతూనే ఉంటుందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అందులో భాగంగానే వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేశామని, త్వరలో మండల, గ్రామ స్థాయి యువజన విభాగం కమిటీలను కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. మంగళవారం మద్దిలపాలెంలో గల వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర యువజన విభాగం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. త్వరలో నియోజకవర్గ, మండల, గ్రామ యువజన విభాగం ఇన్‌చార్జిలను నియమించాలని దిశా నిర్దేశం చేశారు. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, ప్రజలంతా ఎదురు తిరిగే రోజు అతి త్వరలో వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇవ్వడం.. గెలిచిన తరువాత పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అండ్‌ కో.. అధికారం చేపట్టిన తరువాత ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలే వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితులను చూస్తున్నామని మండిపడ్డారు. నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ.3 వేలు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించేవరకూ మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం పోరాడుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.

రాజాకు సత్కారం

ఉత్తరాంధ్ర సమావేశానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాను విశాఖ యువజన విభాగం అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ కొండారాజీవ్‌ గాంధీ, ఉత్తరాంధ్ర జోనల్‌ అధ్యక్షుడు మెంట స్వరూప్‌ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు మారపు పృథ్వీరాజ్‌, సూరిబాబు, వెంకటేష్‌, గవాడ శేఖర్‌, 66వ వార్డ్‌ కార్పొరేటర్‌ మహ్మద్‌ ఇమ్రాన్‌, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement