అల్లిపురం (విశాఖ): తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించి, తనను, తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని, ఇందుకు అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శిరీషరాణి, కలెక్టర్ విజయ కృష్ణన్‌లే బాధ్యులని ఈదడం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమిహ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిలు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. 2014లో దివంగత సీఎం వైఎస్సార్ దయ వల్ల ముస్లిం రిజర్వేషన్‌లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించానన్నారు. సర్వీసు మొత్తం దాదాపు మూరుమూల పంచాయతీల్లోనే సాగినట్లు తెలిపారు. పలుమార్లు తన తల్లికి బాగాలేదని బదిలీ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అర్జీలు పెట్టుకోగా చివరికి పాయకరావుపేటలోని ఈదడం పంచాయతీలో పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. తన విధుల్ని సక్రమంగా నిర్వహించుకుంటున్నా.. అకారణంగా జీతం నిలిపేశారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. మునగపాకలోని తోటాడ పంచాయతీకి డిప్యుటేషన్ కోరగా, పలాపు ఆనందపురం పంచాయతీలో పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.
వరుసగా వేధింపులు
2023 జూలైలో లేనిపోని ఆరోపణలతో ఫోర్జరీ కేసు పెట్టి తనను సస్పెండ్ చేశారని సమిహ వివరించారు. 2024 ఆగస్టు 22 వరకు ఎంక్వయిరీ చేయకుండా డీపీవో శిరీషరాణి ‘రిటైర్‌మెంట్ యాజ్ మేజర్ పనిష్‌మెంట్’అని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. దీనిపై హోం మినిష్టర్ అనితకు ఫిర్యాదు చేయడానికి వెళితే, గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, గొల్ల బాబూరావులపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలని తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వెల్లడించారు. అసలు వారిని ఏనాడూ ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసిందే లేదని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసేందుకు వెళితే.. తనపై జూనియర్ అసిస్టెంట్‌తో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారని తెలిపారు. ఒక మహిళగా తాను ఫిర్యాదు చేస్తే స్పందించని పోలీసులు, అతని ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను పిఠాపురం కార్యాలయం, మంగళగిరి కార్యాలయానికి పలుమార్లు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని వాపోయారు. ఇప్పటికై నా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని, నిలిపివేసిన జీతం, పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, బాబూరావులపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలని హోం మంత్రి ఒత్తిడి
ఒప్పుకోలేదని లేనిపోని ఆరోపణలు చేసి ఆరు నెలల క్రితం విధుల నుంచి తొలగించిన డీపీవో శిరీషరాణి
నాకు జరిగిన అన్యాయంపై పిఠాపురం కార్యాలయంలో పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
అనకాపల్లి కలెక్టర్, డీపీవోలపై పంచాయతీ కార్యదర్శి సమిహ విమర్శలు