● యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
అనకాపల్లి : 2023 జూలై 1 నుంచి రావాల్సిన 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ని నేటివరకూ ప్రభుత్వం నియమించలేదని, కూటమి ప్రభుత్వం తక్షణమే నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జిల్లా యూటీఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన గత ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించినప్పటికీ అతనికి ఎలాంటి విధివిధానాలు రూపొందించకపోవడం వల్ల రిజైన్ చేసి వెళ్లిపోయారని, వచ్చిన కొత్త ప్రభుత్వం తొమ్మిది నెలలు పూర్తవుతున్నా నేటి వరకూ 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించలేదన్నారు. చైర్మన్ నియామకం విధివిధానాలను రూపొందించి, సంఘాలతో చర్చించి వివిధ రకాలైన ప్రతిపాదనలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది కనుక, తక్షణం చైర్మన్‌ని నియమించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ 29 శాతాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పాత బకాయి రూ.7వేలు కోట్లు చేసినప్పటికీ, నేటికీ రూ.25 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బకాయిలలో సరెండర్ లీవ్ ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సరికాద ఆయన విమర్శించారు. జీవో 117 కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, ఈ జీవోను తక్షణమే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలను అన్ని అంగులతో ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సు శ్రీకాకుళం కేంద్రంలో మార్చి 31న జరుగుతుందని, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు వెంకటరావు, సహాధ్యక్షుడు రొంగలి అక్కు నాయుడు, జిల్లా కార్యదర్శులు జి.ఎస్. ప్రకాష్, ఎన్.శేషు కుమార్, మాకిరెడ్డి రాజనాయుడు, రమేష్ రావు, కోశాధికారి జోగా రాజేష్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లయ్య బాబు, ఎం.వి.అప్పారావు, గేదెల శాంతి దేవి పాల్గొన్నారు.