● పాడిపెయ్యి మృతి, మరో మూడు ఆవులకు తీవ్ర గాయాలు
మునగపాక : మునగపాక నుంచి వాడ్రాపల్లికి వెళ్లే మార్గంలో గురువారం తెల్లవారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాడి పెయ్యి మృతి చెందగా మూడు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి కల కారణం తెలియరాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మునగపాకకు చెందిన కర్రి నాగేశ్వరరావు,శరగడం లక్ష్మి, ఆడారి రామసూరి అప్పలనాయుడు,ఆడారి శ్రీరామమూర్తి, దొడ్డి పరదేశినాయుడు, దొడ్డి నాగప్పారావు పాడి పశువుల పెంపంకపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం 3.30 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పాకకు నిప్పంటించడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న బాధిత రైతులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, శ్రీ ధర్మ ఫౌండేషన్ చైర్మన్ కర్రి సాయికృష్ణ తదితరులు బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి కల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సంఘటన స్థలానికి తహసీల్దార్ ఆదిమహేశ్వరరావుతో కలిసి వెళ్లి పరిశీలించారు. బాధితులకు గోకులం షెడ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా తీవ్రగాయాల పాలైన పశువులకు స్థానిక పశువైద్యాధికారి లావేటి ప్రదీప్‌కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఎస్‌ఐ పి.ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుతెన్నులను పరిశీలించారు.