అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శోభారాణి, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారి జాతర సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గవరపాలెం పురవీధుల గుండా అమ్మవారి ఘటాల ఊరేగింపు జరుగుతుందని, శనివారం కొత్త అమావాస్య వేడుకలు, ఆదివారం ఉగాది నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది నుంచి అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడంతో అమ్మవారికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టువస్త్రాలు తీసుకు వస్తారన్నారు.