రోలుగుంట మండలంలో 3 వేలకు పైగా గిరిజనులు నివసిస్తుంటారు. అర్ల, పీతిరిగడ్డ, లూసింగి, పెదలూసింగి, కొరుప్రోలు గ్రామాలవారు సొంతంగా బావి తవ్వుకొని అక్కడి నుంచి నీరు తెచ్చుకొని తాగుతారు. వేసవి వచ్చిందంటే ఆ బావి అడుగంటి బురద నీళ్లుగా తయారవుతాయి. దీంతో తాగడానికి నీరు లేక సమీపంలో 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే గెడ్డలు, వాగుల్లోకి వెళ్లి బిందెలతో తెచ్చుకుంటారు. గతంలో కలెక్టర్ విజయ కృష్ణన్ పర్యటించినప్పుడు బిందెలతో గిరిజన మహిళలు నిరసన కూడా తెలియజేశారు. గొలుగొండ మండలంలోని అన్ని గిరిజన గ్రామాల్లో నీటి సమస్య ఉంది. నాతవరం మండలంలో 30కి పైగా గిరిజన గ్రామాలున్నాయి. సుందరకోట, రత్నగిరి, బమ్మిళ్లోద్దు, ముత్తమామిళ్లోద్దు, కొత్తోద్దులు, తోరడ, పాత సిరిపురం, కొత్త సిరిపురం గ్రామాలు కొండపై ఉండడంతో వేసవిలో అక్కడి బావుల్లో నీరు తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వేసిన బోర్లు కూడా అడుగంటిపోతాయి. ఇలాంటి సందర్భంలో అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నమేదీ జరగడం లేదు. మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండలాల పరిధిలో 55 గిరిజన గ్రామాలు ఉన్నాయి. మాడుగుల మండలంలో వాపర్తి, రాజంపేట గ్రామాల్లో 150 మంది గిరిజనులు నివాసం ఉంటారు. చీడికాడ మండలంలోని కోనాం శివారు బందవీధి గిరిజన గ్రామంలో గిరిజనులు తాగునీటి కోసం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దేవరాపల్లి మండలంలో వాలాబు పంచాయతీ శివారు కె.తుమ్మలపాలెం, కొత్తూరు, ఇప్పగరువు గ్రామాల్లో పలుచోట్ల పైపులైన్లు దెబ్బతిన్న కారణంగా తాగునీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గిరిజన గ్రామాల్లో గొంతెండుతోంది...