● నిర్దేశిత ఫార్మాట్‌లో మరోసారి నోటీసు అందజేసిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
యలమంచిలి రూరల్ : యలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారిపై అవిశ్వాసం కోరుతూ వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్లు గురువారం మరోసారి అనకాపల్లి జిల్లా కలెక్టరు, ఆర్డీవో, యలమంచిలి మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు నోటీసు అందజేశారు. వాస్తవానికి బుధవారమే నోటీసు అందజేసినప్పటికీ నిర్దేశిత ఫార్మాట్‌లో నోటీసు ఇవ్వాల్సి ఉండడంతో పురపాలక ఎన్నికల నియమావళిని అనుసరించి ఫాం–1 పూర్తి చేసి దానిపై 18 మంది వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్లు సంతకాలు చేసిన నోటీసు కాపీలను మరోసారి అధికారులకు అందజేశారు. యలమంచిలి మున్సిపాలిటీలో 25 వార్డులుండగా 23 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలుపొందారు. మున్సిపాలిటీలో 5వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యురాలిగా ఎన్నికై న పిళ్లా రమాకుమారిని 2021 మార్చిలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారకాంక్షతో పిళ్లా రమాకుమారి బీజేపీలో చేరారు. నాలుగేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో వైఎస్సార్‌సీపీ మద్దతుతో చైర్‌పర్సన్‌గా ఎన్నికై న రమాకుమారి పార్టీ మారడంతో అవిశ్వాసం కోరుతూ మెజార్టీ కౌన్సిలర్లు కలెక్టరుకు నోటీసు అందజేశారు. ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని నోటీసులో కోరారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో యలమంచిలి పట్టణంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అవిశ్వాస నోటీసు అధికారులకు అందజేసిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు గుప్తా, దూది నర్సింహమూర్తి, పిళ్లా త్రినాథరావు, కొఠారు కొండబాబు, పలువురు వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.