పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలంలోని వాకపాడు రెవెన్యూ పరిధిలో 73, 74, 75, 77, 78, 344, 345, 346, 347, 348, 351, 352, 353, 354, 435, 438, 439, 441, 442, 443, 445 సర్వే నంబర్లకు చెందిన సుమారు 103 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములకు దాదాపు సుమారు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇదే గ్రామాలకు చెందిన పలువురు రైతుల పేరుతో ఢీ–ఫారం పట్టాలు మంజూరు చేసింది. అప్పటినుంచి సదరు రైతులు ఈ భూములను సాగుచేసుకుంటున్నారు. ఈ భూములపై కన్నేసిన స్థానిక టీడీపీ నేత...రొయ్యల చెరువుల పేరుతో చేజిక్కించుకునేందుకు స్కెచ్ వేశారు.
ఆక్వా సాగు చేసి వచ్చిన లాభాల్లో మీకు వాటాలు పంచుతానంటూ ‘అబద్ధాలు’ చెప్పి పదేళ్ల క్రితం సదరు టీడీపీ నేత లీజుకు తీసుకున్నారు. పేదలైన వీరంతా అతనికి లీజుకు ఇచ్చారు. దీన్ని ఆసరాగా తీసుకుని 103 ఎకరాల ప్రభుత్వ భూములను 2012 ఏప్రిల్ 10వ తేదీన 42 సబ్ డివిజన్లుగా విభజించి ఈ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి జగన్‌మోహన్‌రావు తండ్రి వీరభద్రరావును తెరమీదకు తీసుకు వచ్చి అతని పేరున మ్యూటేషన్ (వెబ్‌ల్యాండ్‌లో) నమోదు చేశారు. ఈ 42 సబ్‌డివిజన్లకు 42 ఖాతా నంబర్లు ఇచ్చారు.
సదరు రైతులు తమకు లీజు మొత్తం ఇవ్వాలని లేదంటే భూములు వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు. అసలు మీ భూములు ఎక్కడ అని ఎదురు ప్రశ్నించడంతో రైతులు గొల్లుమంటున్నారు. అంతేకాకుండా తిరిగి ఇప్పుడు మంత్రి పేరు చెప్పి బెదిరించి కేసులు కూడా పెట్టిస్తున్నారు. పదేళ్లుగా వరి సాగు చేస్తూ... ఏటా 3 వేల బస్తాల ధాన్యం పండిస్తున్నారు. తమకు మాత్రం ఒక్క గింజ కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దళితులకు చెందిన ఈ భూములు ఉన్న ప్రాంతాలకు పక్కనే ఆక్వా సాగు జరుగుతోంది.
ఆక్వా సాగుకు అవకాశం ఉన్న భూములు కావడంతో మార్కెట్లో ధర కూడా బాగానే ఉంది. 103 ఎకరాల ఈ భూమి విలువ రూ.50 కోట్ల మేరకు ఉంటుందని తెలుస్తోంది. సదరు టీడీపీ నేత సాగు చేస్తున్న పంట పొలాలతోపాటు పక్కనే ఇతర నేతలు ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులకు వెళ్లేందుకు మాత్రమే ఈ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.