జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు నాయుడు
మాడుగుల రూరల్: హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి హిందూ బంధువు హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలని జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు డి.డి.నాయుడు పేర్కొన్నారు. కె.జె.పురం కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మండల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు రాపేట రామకొండలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయుడు మాట్లాడుతూ శ్రీరాముని ధర్మపాలన గురించి రామాయణ, మహాభారతం, భాగవతం గ్రంథాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి ఆరవల్లి సాయి ప్రదీప్ మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిరక్షణకు వీహెచ్‌పీ ఎనలేని కృషి సల్పిందన్నారు. సమావేశంలో జిల్లా బాధ్యులతో పాటు సమరతాసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు తవ్వా సన్యాసిశెట్టి, మూడు మండలాల ప్రఖండ్ చిరంజీవినాయుడు, మండల వీహెచ్‌పీ అధ్యక్షుడు కరణం దేముళ్లు, కార్యదర్శి పెచ్చెట్టి కొండలరావుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, వివిధ విభాగాలు అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా అధ్యక్షుడు నాయుడు, కార్యదర్శి ప్రదీప్ తదితరులు వీహెచ్‌పీ మండల కమిటీ సారథ్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చీడికాడ, మాడుగుల, మండలాలకు చెందిన వీహెచ్‌పీ గ్రామ శాఖ కమిటీ సభ్యులు, ప్రఖండ్ సభ్యులు, పాల్గొన్నారు.