
సుర్రుమన్న సూరీడు....
● చోడవరంలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
చోడవరం : రెండ్రోజులుగా సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సోమవారం చోడవరంలో 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండ తీవ్రతతోపాటు వడగాడ్పులు వీయడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8గంటల నుంచే ఎండ ప్రారంభమైంది. 9గంటల నుంచి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన ఉష్ణోగ్రత పెరుగుతూ మధ్యాహ్నం ఒంటిగంట 38.5డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. మోటారు సైకిలిస్టు, బాటసారులు, ఆటోవాలాలు ఎవరూ బయటకు రాలేకపోయారు. తప్పనిసరి బయటకు వచ్చిన వారు తలకు, ముఖానికి రక్షణ కవచాలు ధరించారు. తరుచూ విద్యుత్ కోతలు కూడా ఉండడంతో ఉక్కపోతతో చిన్నాపెద్దా, వృద్ధులు సతమతమయ్యారు. ఎండ తీవ్రత బాగా పెరిగినందున అత్యవసరమైతే తప్ప ఎవరూ బయట తిరగవద్దని వైద్యులు చెబుతున్నారు. మరో పక్క చల్లటి పానీయాల దుకాణాలు రద్దీగా మారాయి.