
ఆదివాసుల భూములపై కిరాయి మూకల దాడి
● పంటల ధ్వంసం ● కేసు నమోదు చేసిన పోలీసులు
రోలుగుంట : ఆదివాసుల భూములపై పొరుగుజిల్లాకు చెందిన కిరాయి మూకలు దాడి చేసి పంటలు ధ్వంసం చేసిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలివి. ఎం.కె.పట్నం రెవిన్యూ సర్వే నెంబరు 139 లో పది ఎకరాలు మెట్టు భూమి దశాబ్దాలుగా చటర్జీపురం ఆదివాసీల సాగులో ఉంది. వారి సాగును రికార్డులో కూడా నమోదు చేశారు. అయితే ఆ భూమిపై కన్ను పడిన స్థానికేతరుడు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన మల్లిడి రామిరెడ్డి అనే వ్యక్తి 2021లో ఈ భూములను కొనుగోలు చేశామని ఆదివాసీలను అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నం చేశాడు. దీనికి వారా నూకరాజు అనే వ్యక్తి మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆదివాసీలు నర్సీపట్నం సివిల్ కోర్టులో మల్లిడి రామిరెడ్డి, వారా నూకరాజుపై కేసు దాఖలు చేశారు. ఈ కేసుల్లో రామిరెడ్డి గైర్హాజరు కాగా నూకరాజు కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా 2023 జనవరిలో ఈ భూమిని తన పేరుతోను, ఐటీడీఏ పాడేరు పరిధిలో టీచర్‌గా పని చేస్తున్న తన కుమారుడు కన్నబాబు పేర్లతో రామిరెడ్డి నుంచి నూకరాజు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి వారు చటర్జీపురం ఆదివాసీలపై బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తూ వస్తున్నారు. 2023 సెప్టెంబర్‌లో వారా నూకరాజు, టీచర్ కన్నబాబు 70 మంది కిరాయిమూకలతో ఆదివాసీలపై దాడి చేశారు. వారు పెంచుతున్న అరటి, జామచెట్లను ధ్వంసం చేశారు. దీంతో వీరిద్దరిపైనా రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాలతో పొలం జోలికి వెళ్లబోమని, పంటలను ఆలానే ఉంచాలని చెప్పి పోలీసులు సంతకాలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో నూకరాజు మళ్లీ సోమవారం 4 ఆటోలు, 50 మందితో వెళ్లి ఆ భూమిలో పంటలను ధ్వంసం చేశారు. ఈ చర్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నూకరాజును ఆరెస్ట్ చేయాలని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. దీంతో ఎస్‌ఐ రామకృష్ణారావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఎస్‌ఐ విలేకరులతో మాట్లాడుతూ పంట ధ్వంసం కారకుడిని అదుపులోకి తీసుకుని, దాడిలో పాల్గొన్నవారిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు.