
తప్పుడు కేసులు పెడితే భయపడేదిలేదు
● మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ● వైఎస్సార్‌సీపీ నేత కర్రి శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై ధ్వజం ● అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా
నర్సీపట్నం: వైఎస్సార్‌సీపీ నేత, బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావుపై రాజకీయ కక్షతో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పోలీసు కేసులు పెట్టించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు. నంద్యాల పోలీసులు కర్రి శ్రీనివాసరావును తీసుకువెళ్లిన నేపథ్యంలో ఆయన బుధవారం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ వేధింపులకు గురైన వైఎస్సార్‌సీపీ నేతలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. గత ఫిబ్రవరి 24న కర్రి శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ ఇంటిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులతో కూల్చివేయించారన్నారు. ఈ సందర్భంగా జరిగిన అన్యాయంపై, అయ్యన్నపాత్రుడు వేధింపులపై శ్రీనివాసరావు ఆవేదన వెలిబుచ్చారన్నారు. దీనిని సహించలేని అయ్యన్నపాత్రుడు అతనిపై నాలుగు చోట్ల పోలీసు కేసులు పెట్టించారన్నారు. దీనిలో భాగంగానే నంద్యాల జిల్లా జాలదుర్గం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా బుధవారం ఉదయం 8 గంటలకు నర్సీపట్నం టౌన్ పోలీసులు శ్రీనివాసరావును తీసుకువెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన ఏమాత్రం భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర తదితరులు ఉన్నారు.