మ్యుటేషన్ల కోసం ముప్పుతిప్పలు దళారులతో రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కు | - | Sakshi
Sakshi News home page

మ్యుటేషన్ల కోసం ముప్పుతిప్పలు దళారులతో రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కు

Apr 3 2025 12:42 AM | Updated on Apr 3 2025 12:42 AM

మ్యుట

మ్యుటేషన్ల కోసం ముప్పుతిప్పలు దళారులతో రెవెన్యూ సిబ్బంద

మాయలు అన్నీ ఇన్నీ కావు

ప్రస్తుతం క్రయవిక్రయాలకు వెబ్‌ల్యాండ్‌ కీలకంగా మారింది. ఆన్‌లైన్‌లో రైతు పేరు నమోదై ఉంటే చాలు రిజిస్ట్రేషన్‌ జరిగిపోతోంది. పట్టాదారు పాసుపుస్తకాలు, దస్తావేజులతో పనిలేదు. గత నెలలో నక్కపల్లి మండలం వేంపాడులో ఒక రైతుకు చెందిన 7 ఎకరాల భూమిని వేరొకరి పేరున ఎటువంటి ఆధారాలు లేకుండానే వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. దీని ఆధారంగా ఈ భూమిని ఒక జనసేన పార్టీ నాయకుడు కొనుగోలు చేశాడు. విషయం తెలిసి వారసులు లబోదిబోమంటూ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారు. ఇంతలో కొనుగోలు చేసిన వ్యక్తి వెబ్‌ల్యాండ్‌లో వన్‌ బి, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ను ఆధారంగా చేసుకుని కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ భూమి వివాదంలో పడింది.

నక్కపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు రెవెన్యూ లీలలతో అష్టకష్టాలు పడుతున్నారు. పైసలిస్తే గానీ ఏ పనీ జరగడం లేదు. మామూళ్లు ఇవ్వకపోతే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసేందుకు సిబ్బంది సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. అదే సొమ్ము ముడితే తిమ్మిని బమ్మి చేయడానికై నా సిద్ధపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వెబ్‌ల్యాండ్‌ డబ్బు ల్యాండ్‌గా మారింది. తహసీల్దార్‌ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నాయి. అక్కడక్కడా నీతిమంతులు ఉన్నప్పటికీ చాలాచోట్ల అవినీతి రాజ్యమేలుతోంది.

ప్రతి పనికీ లంచమే...

వారసత్వం, లేదా కొనుగోలు చేసిన ఆస్తి పంపకాల ద్వారా సంక్రమించిన ఆస్తిని తమ పేరున మార్చుకుని పాసుపుస్తకాలు పొందేందుకు రైతులు లక్షలాది రూపాయలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి పాలనలో రెవెన్యూ శాఖలో అవినీతి పరాకాష్టకు చేరుకుంది. ఎకరా భూమికి పాసు పుస్తకం జారీ చేయాలంటే

రూ.25 వేలకు పైనే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎకరా భూమిని సర్వే చేసి సాగులో ఉన్నట్లు సర్టిఫికెట్‌ జారీ చేయాలంటే రూ.30 వేలు చెల్లించుకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ సిటీకి ఆనుకుని ఉన్న పరవాడ, సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, పెదగంట్యాడ, అనకాపల్లి తదితర మండలాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. రెండెకరాల భూమిని సర్వే చేసి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయాలంటే లక్షన్నర ముట్టజెప్పాల్సి వస్తోందని ఆయాప్రాంతాల రైతులు వాపోతున్నారు. పూర్వార్జితంగా దఖలు పడిన ఆస్తి విషయంలో కూడా మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే.

తహసీల్దార్‌ వద్ద గోప్యంగా ఉండాల్సిన డిజిటల్‌ సైన్‌ కొంతమంది సిబ్బంది, దళారులకు తెలిసిపోతోంది. రైతులకు సంబంధించిన భూముల వివరాలు, పేర్లు వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేర్పులు తొలగింపులకు ప్రతి తహసీల్దార్‌కు ఒక పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. దీన్ని ఉపయోగించి ఆయా మండలానికి చెందిన వెబ్‌ల్యాండ్‌ను ఓపెన్‌ చేసి ఇష్టానుసారం మార్పులుచేర్పులు చేయొచ్చు. ఒక భూమికి సంబంధించి లావాదేవీలు జరపాలనుకుంటే అసలు హక్కుదార్లను వెబ్‌ల్యాండ్‌ల నుంచి తాత్కాలికంగా తొలగించి వేరొక పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ యధావిధిగా పాతరైతు పేరున మార్చేయవచ్చు. ఈ వెసులుబాటు వెబ్‌ల్యాండ్‌లో ఉంది. ప్రభుత్వభూమి అయినా సర్వే జిరాయితీగా చూపించి తమకు నచ్చిన వారి పేరున వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే వెసులుబాటు ఉంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లందరూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే. దీంతో సిబ్బంది, దళారులు వీరితో కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏడాది క్రితం నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో పలు గ్రామాల్లో పలు భూములకు ఇలా రిజిస్ట్రేషన్‌లు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ఉపయోగించుకుని గతంలో టీడీపీ ప్రభుత్వంలో వేంపాడు, అమలాపురం, మూలపర గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్థానిక టీడీపీ నాయకులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కయి తమ పేరున నమోదు చేసుకున్నారు. కొండపోరంబోకు భూములను తమ పేరున వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుని పాసుపుస్తకాలు జారీ చేయించుకున్నారు. ఈ అక్రమాలు పత్రికల్లో రావడంతో ఒక డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐ, ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినప్పటికీ స్థానిక రెవెన్యూ సిబ్బందిలో మార్పు రావడంలేదు.

వెబ్‌ల్యాండ్‌ కాదు... డబ్బు ల్యాండ్‌

డిజిటల్‌ సైన్‌ దుర్వినియోగం

మ్యుటేషన్ల కోసం ముప్పుతిప్పలు దళారులతో రెవెన్యూ సిబ్బంద1
1/2

మ్యుటేషన్ల కోసం ముప్పుతిప్పలు దళారులతో రెవెన్యూ సిబ్బంద

మ్యుటేషన్ల కోసం ముప్పుతిప్పలు దళారులతో రెవెన్యూ సిబ్బంద2
2/2

మ్యుటేషన్ల కోసం ముప్పుతిప్పలు దళారులతో రెవెన్యూ సిబ్బంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement