పాయకరావుపేట: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పరివర్తన నిలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ మృతి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ బృందం వల్ల ప్రయోజనం లేదన్నారు. హంతకులను రక్షించేలా పోలీసు విచారణ జరుగుతుందన్నారు. ప్రవీణ్ పగడాల మరణం రోడ్డు ప్రమాదంలో జరగలేదని, ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యని కృష్ణ స్వరూప్ ఆరోపించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేని చర్చిలను తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అత్యంత దారుణమన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దువ్వాడ దావీదు, రాష్ట్ర నాయకురాలు దాసరి అన్నపూర్ణ, మాల మహానాడు పాయకరావుపేట అసెంబ్లీ ఇన్‌చార్జ్ బడుగు అచ్చారావు, తదితరులు పాల్గొన్నారు.