
ముగిసిన టెన్త్ పరీక్షలు
అనకాపల్లి టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన మంగళవారం సోషల్ పరీక్ష జరిగింది. పరీక్షలు సజావుగా సాగడానికి కృషి చేసిన, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సలహాలతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, తపాలా ఆర్టీసీ, జీవీఎంసీ, పురపాలక, పంచాయతీ, సచివాలయ అధికారులు, సిబ్బంది పరీక్షల నిర్వహణకు సహకరించారన్నారు. అందరి కృషితో ఎటువంటి ఇబ్బందులు పడకుండా పదో తరగతి బోర్డు పబ్లిక్, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన సాంఘిక పరీక్షకు జిల్లాలో 99.54 శాతంమంది హాజరయ్యారని డీఈవో తెలిపారు.