
నేడు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏఆర్, పీఆర్సీలు ప్రకటించాలని, విద్యారంగం, ఆర్ధిక పరమైన సమస్యలు పరిష్కరించాలని ఈనెల 2న కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు నిరసన కార్యక్రమాన్ని ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. సీపీఎస్, జీపీఎస్‌లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం బకాయిపడ్డ మూడు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఆలస్యమైతే తక్షణమే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని అన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్రం అమలు పరిచిన జీవో 57 ను అమలు చేసి వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాని, ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు, ఉర్దూ మాధ్యమాలను కొనసాగించాలని, పంచాయతీ రాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే అమలు చేయాలని, 11వ పీఆర్సీ, డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రభుత్వం, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సంబంధించిన 72 ,73, 74 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కార్యదర్శి వై.సుధాకర్ రావు, కె.ఎస్.ఎస్.ప్రసాద్, కోశాధికారి ఎస్.దుర్గాప్రసాద్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సభ్యులు ఎం. శ్రీనివాసరావు, వై. శ్రీనివాసరావు, చల్ల నాగేశ్వరావు పాల్గొన్నారు.