
పునరావాస ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలి
కలెక్టర్ విజయకృష్ణన్
నక్కపల్లి: ఏపీఐఐసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులు ఆదేశించారు. మంగళవారం ఆమె పెద బోదిగల్లంలో పునరావాసం కోసం ఎంపిక చేసిన భూములను పరిశీలించారు. మొత్తం ఎంత భూమి గుర్తించారు.. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.. అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాబోయే ప్రాంతాల్లో ఏపీఐఐసీ వారు చేపట్టిన భూసేకరణలో, నివాస ప్రాంతాలు కోల్పోయిన వారికి సుమారు 800 మందికి పైగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. వీరందరికి బోదిగల్లం వద్ద పునరావాసం కల్పించేందుకు నిర్ణయించామన్నారు. సుమారు 170 ఎకరాలను గుర్తించి నేరుగా రైతులనుంచి కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు. రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ మొదలయిందన్నారు. త్వరగా పూర్తిచేసి గుర్తించిన భూముల్లో లేఅవుట్లు వేసి నిర్వాసితులకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. పునరావాసం పొందే నిర్వాసితులకు అవసరమైన తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, వాడుకనీరు, రోడ్లు, డ్రెయినేజీ సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు నివాస యోగ్యంగా ఉండే అన్ని సదుపాయాలు త్వరగా కల్పించాలన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ కోసం అదనంగా మరో వెయ్యి ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఏపీఐఐసీ ద్వారా పెదతీనార్ల, జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం గ్రామాల్లో భూములను సర్వే చేసి గుర్తించడం జరిగిందన్నారు. రైతులతో గ్రామసభలు నిర్వహించి వారికి తెలియజేయాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట ఏపీఐఐసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.