
క్వారీ క్రషర్స్ కార్మికుల సమ్మె
అనకాపల్లి: రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలతో మండలంలో వివిధ స్టోన్ క్రషర్స్‌లో క్వారీ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ చేస్తున్న కార్మికులకు 11వ వేతన ఒప్పందం క్వారీ యజమానులు అమలు చేయకపోవడం అన్యాయమని జిల్లా క్వారీ క్రషర్స్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కోనమోహనరావు అన్నారు. బవులవాడ పంచాయతీ దర్జినగర్ గ్రామంలో క్వారీ కార్మికులు మంగళవారం సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. క్వారీల్లో డ్రిల్లింగ్ చేసే కార్మికులకు (ఒక అడుగు) డ్రిల్లింగ్ కార్మికులకు రేటు రూ.10 పెంచాలని, కంప్రెషర్ యజమానులు రూ.30 పెంచాలని, క్వారీ, స్టోన్ క్రషర్స్‌లో ప్రమాదం జరిగి కార్మికుడు మరణించినప్పుడు ఆ కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారంగా రూ.25 లక్షలు చెల్లించి, అంత్యక్రియల ఖర్చులకు రూ.2 లక్షలు చెల్లించాలని, క్వారీ, స్టోన్ క్రషర్స్‌లో ప్రమాదం జరిగి కార్మికుడు అంగవైకల్యానికి గురైతే ‘వర్క్ మెన్ కాంపెన్షేషన్ యాక్ట్–1923‘ ప్రకారం (క్వారీ, స్టోన్ క్రషర్స్ యాజమాన్యం) నష్టపరిహారం చెల్లించి, వైద్యం ఖర్చులు పూర్తిగా యాజమాన్యమే భరించాలన్నారు. ప్రమాద భత్యంగా కార్మికుడికి పూర్తిగా నయం అయ్యేవరకు కుటుంబ పోషణకు వారానికి రూ.3వేలు ఇవ్వాలని, కంప్రెషర్ డ్రైవర్లకు ప్రస్తుతం ఇస్తున్న నెల జీతం రూ.6 వేలు నుంచి రూ.12 వేలకు పెంచాలని, సంక్రాంతి లేదా దసరాకు ఒక జత బట్టలు బోనస్ ఇవ్వాలని, కార్మికులకు రూ.10 లక్షలు బీమా యాజమాన్యం చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నా యకులు శానాపతి అప్పలనాయుడు, చింతల రమేష్, సేనాపతి సూరిబాబు, ముమ్మిన శ్రీను, ఎ.అప్పలనాయుడు, జొమ్మల రమణ, కోరుకొండ నాయుడు, బవులవాడ, ఊడేరు, మార్టూరు, మాకవరం, మామిడిపాలెం గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.
11వ వేతన సవరణ చేయాలని డిమాండ్