
అంత్రరాష్ట్ర సర్వీసులకు కొత్త బస్సులు
ఆర్‌ఎం అప్పలనాయుడు
మద్దిలపాలెం (విశాఖ): బస్ డిపోలతో పాటు బస్సులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన విశాఖపట్నం డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. విశాఖపట్నం డిపోలో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. గురువారం నుంచి భద్రాచలం–విజయవాడ బస్సుల ద్వారా మరింత ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం డిపో నుంచి దూర ప్రాంతాలకు, అంత్రరాష్ట్ర సర్వీసులకు కొత్త బస్సులు కేటాయించినట్లు చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు పోటీ తత్వంతో పనిచేసి విశాఖపట్నం డిపోకు మరింత ఆదాయం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బస్సుల మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎస్ 6 బస్సులకు సంబంధించి సిబ్బందికి కొత్త టెక్నాలజీతో కూడిన టూల్స్ సరఫరా చేస్తామన్నారు. వేసవి కాలంలో సిబ్బంది ఎవరూ వడదెబ్బకు గురికాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ, మంచినీళ్లు తీసుకోవాలన్నారు. బస్ స్టేషన్, డిపోల్లో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.