
లక్ష్యానికి మించి ఉపాధి కల్పన
తుమ్మపాల: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 120 లక్షల పని దినాల లక్ష్యాన్ని అధిగమించి 124.67 లక్షల పని దినాలను వేతనదారులకు కల్పించడం ద్వారా రాష్ట్రంలో 6వ స్థానంలో జిల్లా నిలిచిందని కలెక్టరు విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపడుతున్న సర్వేలు, ఎస్.డబ్ల్యూపిసి.షెడ్లు, హౌసింగ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ, చలివేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు లక్ష్యానికి మించి పని దినాలు కల్పించడం ద్వారా రూ.350 కోట్లు వేతనాల రూపంలో లబ్ధి పొందారని, కూలీలకు సగటు రోజువారీ వేతనంగా రూ.281 చెల్లించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచామన్నారు. మెరుగైన పనితీరుతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 127 లక్షల పని దినాల లక్ష్యం అధిగమించి మొదటి స్థానంలో నిలిచేందుకు అఽధికారులు కృషి చేయాలన్నారు.
2024–25లో రూ.516.65 కోట్లు వ్యయం చేయగా దానిలో వేతనం ఖర్చు రూ.350.29 కోట్లు, మెటీరియల్ ఖర్చు రూ.154.79 కోట్లు, అడ్మినిస్ట్రేషను ఖర్చు రూ.11.57 కోట్లుగా ఉందన్నారు. ఉపాధి పథకంలో 1,648 రైతులకు చెందిన 1,830 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టడం ద్వారా లబ్ధి పొందారని, 120 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కొబ్బరి మొక్కలు నాటడం జరిగిందన్నారు. పల్లెపండగ కార్యక్రమంలో 745 గోకులం షెడ్లు, రూ.181.22 కోట్లతో 229.09 కిలోమీటర్ల సీసీ, బీటీి రోడ్ల నిర్మాణం, రూ.24.95 కోట్లతో 308 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం, రూ.1.67 కోట్లతో 89 నర్సరీలు, రూ.13 కోట్లతో 44 పట్టు పరిశ్రమ పనులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు సదుపాయాలు లేని 17 గిరిజన ఆవాసాలకు రూ.21.89 కోట్లతో 22.18 కిలోమీటర్ల రోడ్డును మంజూరు చేయడం జరిగిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 127 లక్షల పని దినాలు, పశువులకు నీటి తొట్టెలు 215, పంట సంజీవని 7,200, పంట కాలువల పునరుద్ధరణ 451.50 కిలోమీటర్లు, చెరువుల సమగ్ర అభివృద్ధి 977 పనులను మంజూరు చేసి, పనులన్నింటిని ఈ నెల 1 నుంచి ప్రారంభించామన్నారు.
వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు
జిల్లాలో మంచినీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక చలివేంద్రం, ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల అదనంగా ఏర్పాటుచేయాలన్నారు. బోర్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. హౌసింగ్‌కు అదనపు సహాయం లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. జూన్ నాటికి 7,200 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాన్నారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో సోలార్ యూనిట్లు
మోడల్ గ్రామాలుగా గుర్తించిన కశింకోట మండలం బయ్యవరం, సబ్బవరం మండలం గుల్లేపల్లి, మునగపాక మండలం తోటాడ, ఎస్.రాయవరం మండలం గుడివాడ, గొలుగొండ మండలం గొలుగొండ గ్రామాలలో పీఎం సూర్యఘర్ పథకం అమలు పురోగతిని సమీక్షించారు. సోలారు యూనిట్ ఏర్పాటుకు ఉచిత దరఖాస్తుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి ఇంటికీ 1 కె.వి. సోలారు యూనిట్ ఏర్పాటు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి.ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, లీడ్ బ్యాంకు మేనేజరు కె.సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, మండల అభివృద్ధి అధికారులు, మోడల్ గ్రామాల సర్పంచ్‌లు, సచివాలయ సిబ్బంది హాజరయ్యారు.
124.67 లక్షల పనిదినాలు పూర్తి
కలెక్టర్ విజయ కృష్ణన్