
త్వరలో బంగారమ్మపాలెం నుంచి చేపలవేట బంద్!
ఎస్.రాయవరం: బంగారమ్మపాలెం మొగ నుంచి ఇకపై వేట నిషేధం ఉంటుందని, మత్స్యకారులు సహకరించి ప్రత్యామ్నాయం దొండవాక రేవు నుంచి వేట చేసుకునే ఏర్పాటు చేస్తున్నామని నేవల్‌బేస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ అన్నారు. బంగారమ్మపాలెం గ్రామంలో మత్స్యకార పెద్దలతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్రామానికి శరవేగంగా నిర్మాణం కాబోతున్న నేవల్ బేస్ అనుసంధానంగా శారదా, వరహానదుల కలయిక మార్గం నుంచి కొనసాగే మత్స్యవేటను మరికొన్ని రోజుల్లో నిలిపి వేసే చర్యలు ఉంటాయని సమావేశంలో వెల్లడించారు. దీంతో గ్రామస్తులు చేపల వేటకు దారి మూసెస్తే, తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొండవాక వెళ్లి ఎలా వేట చేసుకుంటామని ప్రశ్నించారు. మా గ్రామం ఒక చోట, వేట మరో చోట ఎలా సాధ్య పడుతుందని అన్నారు. అసలు మా గ్రామం తరలించే ఆలోచన ఉందా? ఉంటే ,ఎక్కడికి తరలిస్తారో స్పష్టంగా చెప్పి తమకు ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిస్తామని అధికారులు చెప్పా రు. ఈ సమావేశంలో తహసీల్దార్ రమేష్‌బాబు, ఎస్‌ఐ విభీషణరావు, సర్పంచ్ చోడిపల్లి శ్రీనివాసరావు, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు.