
టీడీఆర్ బాండ్లు వద్దు...నగదే కావాలి
మునగపాక : మాకు టీడీఆర్ బాండ్లు వద్దు...నగదే ముద్దు అంటూ పలువురు నిర్వాసితులు నినదించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భూములు, గృహాలు కోల్పోతున్న బాధితులు శనివారం మునగపాక పీఏసీఏస్ కార్యాలయం ఆవరణలో సమావేశమయ్యారు. రోడ్డు పొడవునా ఉన్న నిర్వాసితులంతా ముక్తకంఠంతో టీడీఆర్ బాండ్లు వద్దంటూ నినదించారు. గ్రామసభల ద్వారా అధికారులు ప్రకటించిన విధంగానే నేరుగా నగదు అకౌంట్‌లో జమ చేయాలని కోరారు. తమకు మరో ప్రత్యామ్నాయం అవసరం లేదని ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిర్వాసితుల సంఘ జేఏసీ నాయకుడు ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రహదారి విస్తరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అయితే గ్రామసభల ద్వారా ప్రకటించినట్టు పరిహారాన్ని నేరుగా నిర్వాసితుల అకౌంట్‌లో జమ చేయాలన్నారు. ప్రతి బాధితుడు తమకు టీడీఆర్ బాండు వద్దంటూ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగు న్యాయం చేయాలన్నారు. అనంతరం జేఏసీ సభ్యులంతా గ్రామాల్లో జరగనున్న సభల్లో టీడీఆర్ బాండ్లను వ్యతిరేకించాలని నిర్ణయించారు. సమావేశంలో నిర్వాసితులు భీమరశెట్టి శ్రీనివాసరావు, బొడ్డేడ రామచంద్రరావు,ఏవీ సత్యనారాయణ,పెంటకోట జగన్నాధరావు మాష్టారు,పొలమరశెట్టి అప్పలనాయుడు,బొద్దపు శ్రీరామమూర్తి,బొడ్డేడ సింధూ మాష్టారు.ఆడారి శ్రీరాములు,విల్లూరి జగన్నాథరావు పాల్గొన్నారు.

టీడీఆర్ బాండ్లు వద్దు...నగదే కావాలి