
బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్‌లు
దువ్వాడలో యుద్ధ వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: శనివారం మధ్యాహ్నం.. ఒక్కసారిగా బాంబు పేలింది.. అంతలోనే గన్‌ఫైరింగ్ వినిపించింది.. బుల్లెట్ల వర్షం కురిసింది.. అక్కడ వ్యాపించిన పొగల నుంచి సైనికులు భారీ రైఫిల్స్ పట్టుకొని ఒక్కసారిగా బయటికి వచ్చారు. ఇక్కడేదైనా యుద్ధం జరుగుతోందా అనే అనుమానాలతో దువ్వాడ సమీప ప్రజల్లో ఆందోళన మొదలైంది. అది టైగర్ ట్రయాంఫ్–2025 విన్యాసాల్లో భాగంగా జరుగుతున్న కార్యచరణ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. మూడు రోజుల పాటు దువ్వాడ ఫైరింగ్ రేంజ్‌లో భారత్, అమెరికా దేశాల సైనికుల మధ్య ఉమ్మడి శిక్షణ కార్యక్రమం జరిగింది. చివరి రోజున యుద్ధ వాతావరణంలో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకుంటూ.. శత్రుసేనలను మట్టుబెట్టాలనే అంశంపై విన్యాసాలు నిర్వహించారు. ఇదే సమయంలో యుద్ధం జరిగినప్పుడు.. ఓవైపు శత్రువులతో పోరాటం చేస్తూనే.. మరోవైపు గాయపడిన తోటి సైనికులకు వైద్య సహకారం అందించేందుకు ఏ విధమైన కార్యచరణ సంసిద్ధం చేయాలన్నదానిపైనా శిక్షణ కార్యక్రమం జరిగింది. సుదర్శన్ చక్ర కార్ప్స్ నేతృత్వంలో బైసన్ డివిజన్ యాంఫీబియస్ బ్రిగేడ్‌కు ప్రాతినిధ్యం వహించిన 8 గూర్ఖా రైఫిల్స్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ గ్రూప్, 5వ పదాతిదళ రెజిమెంట్‌లోని 1వ బెటాలియన్ (బాబ్‌క్యాట్స్), ఒకటో స్ట్రైకర్ బ్రిగేడ్ పోరాట బృందం, 11వ పదాతిదళ విభాగం (ఆర్కిటిక్ వోల్వ్స్) సిబ్బందితో కూడిన భారత ఆర్మీ బృందాలు ఈ ఉమ్మడి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. భారత్, యూఎస్ సైనికులు 100 మీటర్ల నుంచి లైవ్–ఫైరింగ్ డ్రిల్‌లు, 50 మీటర్ల వద్ద క్లోజ్–క్వార్టర్స్ కంబాట్ షూటింగ్, దట్టమైన అటవీ భూభాగంలో పరస్పర కమ్యూనికేషన్ ద్వారా కదలికలు, జంగిల్ లేన్ షూటింగ్ మొదలైన విన్యాసాలు చేపట్టారు.

బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్‌లు

బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్‌లు

బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్‌లు