
ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్‌రామ్
అనకాపల్లి: నేటి యువత మాజీ ఉప రాష్ట్రపతి బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌లో షెడ్యూల్డ్ కులంలో జన్మించి చదువే ఆయుధంగా చేసుకొని అత్యంత ఉన్నత స్థానానికి చేరారని, దేశానికి ఎనలేని సేవలు అందించారని ఆమె పేర్కొన్నారు. దేశంలో హరిత విప్లవం అమలు చేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేసినట్లు ఆమె చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యునిగా, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికి రిజర్వేషన్లు అమలు చేసినట్లు ఆమె తెలిపారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ సమాజానికి దశ దిశ నిర్దేశించారని చెప్పారు. నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులు కార్మిక శాఖ మంత్రిగా ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాజేశ్వరి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు రేబాక మధుబాబూ, అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబూ తదితరులు పాల్గొన్నారు.