
పరిహారంగా నగదు ఇవ్వాలని డిమాండ్
మునగపాక : పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు ఇచ్చే పరిహారాన్ని నేరుగా అకౌంట్‌లో జమ చేయాల్సిందేనని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం మునగపాకలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణ ఎంతో అవసరమైనప్పటికీ బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సరికాదన్నారు. నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ ప్రకటించడం సరికాదన్నారు. రహదారి విస్తరణను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, అయితే గృహాలు, వ్యవసాయ భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు మేలు జరగాలన్నారు. ఆర్‌అండ్‌బీలో చిరువ్యాపారాలు చేసుకునే వారిని ఆదుకోవాలన్నారు. నిర్వాసితులకు న్యాయం జరగకుంటే భవిష్యత్‌లో ఆందోళళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్రి అప్పారావు, కె.సదాశివరావు, రొంగలి రాము, ఎస్.బ్రహ్మాజీ, బొడ్డేడ రామ్‌కుమార్, కాండ్రేగుల రామప్పారావు, టెక్కలి జగ్గారావు పాల్గొన్నారు.