
నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ బంద్
● నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం
● సోమవారం నుంచి సేవలు
నిలిపివేస్తున్నాం: ఆషా
మహారాణిపేట: జిల్లాలో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవను నిలిపివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో సోమవారం నుంచి అన్ని రకాల ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్(ఆషా) ప్రకటించింది. విశాఖపట్నంలో దాదాపు 102 నెట్‌వర్క్ ఆస్పత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆషా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ బకాయిల కారణంగా ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, దీని వల్ల ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ, ఆర్థిక భారం మోయలేనంతగా పెరిగిందన్నారు. ఇప్పటికే అనేక ఆస్పత్రులు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌లు, ప్రైవేటు సంస్థల నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చి ఆస్పత్రులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. ఈ పథకం అమలు చేస్తున్న అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు పూర్తిగా పరపతిని కోల్పోతున్నాయన్నారు. మరోవైపు రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ అప్పారావు తెలిపారు. అయితే.. నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపివేయడం పట్ల పేదలు ఆందోళన చెందుతున్నారు.