
ఇదీ సార్.. వైజాగ్ స్టీల్ బ్రాండ్
● నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులు స్టీల్‌ప్లాంట్‌కే సొంతం ● 6 నుంచి 36 మి.మీ వరకు రీబార్స్, చానల్స్, ● ఐబీమ్స్‌కు రోల్స్ తయారీ ఇక్కడే.. ● ప్రతి ఉత్పత్తిపై వైజాగ్ స్టీల్ టీఎంటీ ముద్ర ● 2002 నుంచి బ్రాండ్ మార్క్‌తో మార్కెట్‌లోకి ఉత్పత్తులు
స్టీల్‌ప్లాంట్‌లో వైర్ రాడ్ కాయిల్స్ తయారీ
బ్రాండింగ్ ఎలా ప్రారంభమైంది
విశాఖ ఉక్కు ఉత్పత్తులను మొదట్లో ఇతర కంపెనీల ఉత్పత్తుల్లాగే మార్కెట్‌లో అమ్మేవారు. ఇతర ఉత్పత్తుల్లో విశాఖ ఉక్కు ఉత్పత్తులను వినియోగదారులు గుర్తించడం కష్టంగా ఉండేది. దీంతో అప్పటి సీఎండీ శివసాగర్‌రావు ఏదైనా గుర్తు ఉంటే బాగుంటుందని ఆలోచించి.. రీబార్స్ మధ్యలో ఆంగ్ల అక్షరం ‘వి’ఉండేలా చేశారు. అది ఎంతో కష్టపడితే తప్ప స్పష్టంగా కనిపించేది కాదు. ఆ తర్వాత, ఉత్పత్తులపై ప్రారంభంలో బ్రాండింగ్ కోసం పెద్ద సైజు నంబర్ పంచ్ అనే సాధనంతో ‘వైజాగ్ స్టీల్’అని కొట్టేవారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అన్ని ఉత్పత్తుల మీద ముద్రించాలంటే ఎక్కువ శ్రమ, సమయం పట్టేది. 2002 తర్వాత నేరుగా ఉత్పత్తి మీద ముద్రపడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ప్రధాన భూమిక వహించేది బ్రాండ్ ఇమేజ్. బ్రాండ్‌ను చూసే వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేస్తారనేది విశ్వజనీనం. అందుకే ప్రతీ సంస్థ తమ ఉత్పత్తుల నాణ్యతతో పాటు బ్రాండ్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తాయి. దేశీయ ఉక్కు పరిశ్రమలో తమ బ్రాండ్‌ను ముద్రించడంలో విశాఖ ఉక్కు కర్మాగారం తనదైన ప్రత్యేకత కలిగి.. మార్కెట్‌లో ప్రతిష్ట కలిగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టీల్‌ప్లాంట్ తుది ఉత్పత్తులు రోలింగ్ మిల్స్ విభాగాలైన లైట్ అండ్ మీడియం మర్చంట్ మిల్(ఎల్.ఎం.ఎం.ఎం), మీడియం మర్చంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్(ఎం.ఎం.ఎస్.ఎం), వైర్ రాడ్ మిల్స్(డబ్ల్యూ.ఆర్.ఎం), స్పెషల్ బార్ మిల్(ఎస్.బి.ఎం), వైర్ రాడ్ మిల్(డబ్ల్యూఆర్‌ఎం)–2, స్ట్రక్చరల్ మిల్ (ఎస్టీఎం)లలో తయారవుతాయి. ఆయా విభాగాల్లో రీబార్స్, రౌండ్స్, యాంగిల్స్, చానల్స్, బీమ్స్ తదితర వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తుల తయారీకి అవసరమైన గైడ్‌ల తయారీని రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్(ఆర్‌ఎస్ అండ్ ఆర్‌ఎస్) విభాగం చేపడుతుంది. 6 మిల్లీమీటర్ల వ్యాసం నుంచి 36 మిల్లీమీటర్ల వరకు ఉన్న రీబార్లు, చానల్స్, ఐబీమ్స్‌లకు రోలింగ్ అవసరమైన రోల్స్‌ను ఇక్కడే తయారు చేస్తారు. నిర్ణీత పరిమాణంలో ఆ రోల్స్‌ను సిద్ధం చేసిన తర్వాత, దానిపై విశాఖ ఉక్కుకు ప్రతిష్టగా నిలిచే వైజాగ్ స్టీల్ టీఎంటీ(థర్మో మెకానికల్ ట్రీట్‌మెంట్) ముద్రను ముద్రిస్తారు.
కీలక విభాగాలకు రోల్స్ తరలింపు
కర్మాగారంలో తయారయ్యే ఉత్పత్తులపై ముద్ర వేసేందుకు సిద్ధం చేసిన రోల్స్‌ను ఆర్‌ఎస్ అండ్ ఆర్‌ఎస్–1, 2 విభాగాల నుంచి ఉత్పత్తులు తయారయ్యే మిల్స్ విభాగాలకు సరఫరా చేస్తారు. అక్కడ తయారవుతున్న ఉత్పత్తులపై వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు వంటి లోగోలను ముద్రిస్తారు.
నకిలీకి ఆస్కారం లేకుండా..
జాతీయ, అంతర్జాతీయ విపణిలో విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఉన్న గిరాకీని బట్టి తరచూ నకిలీ ఉత్పత్తులు తయారవుతున్నట్టు యాజమాన్యానికి తెలిసింది. దీంతో ఎక్కడా డూప్లికేటింగ్ జరగకుండా బ్రాండింగ్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ఉత్పత్తి గ్రేడును కూడా తెలిపే విధంగా ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రాండింగ్ చేస్తున్నారు. వైజాగ్ టీఎంటీ 500డి, వైజాగ్ టీఎంటీ హెచ్‌సీఆర్‌డీ అనేవి ఇప్పటి వరకు ముద్రిస్తూ వచ్చారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైజాగ్ టీఎంటీ ఎఫ్‌ఈ 550డి, 500డి 6686 59, 8568 66 అనే బ్రాండ్ నంబర్లు ముద్రించడం ఇటీవల ప్రారంభించారు. 16ఎంఎం నుంచి 36 ఎంఎం వరకు ఉన్న సైజు ఊచలపై, రైల్వే సంస్థకు పంపే ఉత్పత్తులపై హెచ్‌సీఆర్‌డీ(హై కరోజన్ రెసిస్టెంట్ డకై ్టల్)ను ముద్రిస్తున్నారు.
లోగో ఎలా ముద్రిస్తారంటే.?
రోల్స్‌ను సీఎన్‌సీ లేత్ మిషన్ మీద కావాల్సిన పరిమాణంలో గాడి(గ్రూవ్స్) చేసి, గ్రూవ్స్‌లో రీబార్ నాచ్ చేసి అనంతరం స్పార్కోనిక్స్ బ్రాండింగ్ మిషన్ మీదకు రోల్‌ను ఎక్కిస్తారు. స్పార్కోనిక్స్ బ్రాండింగ్ మిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పుణే) సరఫరా చేసిన ఈ మిషన్‌ను కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేస్తారు. తద్వారా రోల్ మీద సుమారు 1.3 ఎం.ఎం నుంచి 1.9 ఎం.ఎం లోతులో అక్షరం ముద్ర పడుతుంది. అలా ఒక్కో అక్షరం ముద్రిస్తారు. కొన్ని సందర్భాల్లో నాలుగైదు అక్షరాలను ముద్రించే అవకాశం ఉన్నట్లు మిషన్ ఆపరేటర్ తెలిపారు. ఇక్కడ 16 ఎం.ఎం రీబార్ నుంచి 36 ఎం.ఎం రీబార్ వరకు బ్రాండింగ్ చేస్తారు. ఒక్కో రోల్‌కు సుమారు 5 గంటల సమయం పడుతుండగా.. ఇటీవల మార్చిన లోగోకు 6–7 గంటలు పట్టవచ్చునని ఉద్యోగులు తెలిపారు.

ఇదీ సార్.. వైజాగ్ స్టీల్ బ్రాండ్