
అర్ధరాత్రి వ్యవసాయ విద్యుత్
నక్కపల్లి: వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అర్ధరాత్రి వేళ ఇవ్వడంతో ఇబ్బంది పడుతున్నామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్‌ను వేంపాడు సబ్‌స్టేషన్ పరిధిలో సగానికి పైగా రోజులు రాత్రి వేళ ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయదారులు అవస్థలు పడుతున్నారు. వారంలో మూడు రోజులపాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తున్నారని, మిగిలిన రోజుల్లో రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. త్రీ ఫేజ్ సరఫరా ఉపయోగించుకునే మామిడి, జీడి, కొబ్బరి, అరటి, కూరగాయలు తదితర ఉద్యానవన పంటల రైతులు అర్ధరాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లేందుకు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. తోటల్లో ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్‌లైన్లతో ప్రమాదం పొంచి ఉంటోందని, ఈ లైన్లు పొరపాటున తెగిపడినా, విషసర్పాల బారిన పడినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. గడచిన మూడు నెలల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంపాడు సబ్‌స్టేషన్ పరిధిలో లోడ్ ఎక్కువ కావడంతో తొమ్మిది గంటలపాటు అన్ని రోజుల్లో ఒకే సమయంలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారన్నారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని ట్రాన్స్‌కో సిబ్బంది తెలిపారని, సబ్‌స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితమే పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ విద్యుత్ సరఫరా మాత్రం సక్రమంగా జరగడం లేదని రైతులు చెబుతున్నారు. వేంపాడు సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 10 గ్రామాల రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పని పూర్తిగా జరగలేదని, కొద్ది పనులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల ఈ ఇబ్బంది నెలకొందని సిబ్బంది చెబుతున్నారని రైతులు అంటున్నారు. తక్షణమే వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు త్రీఫేజ్ సరఫరాను పగటి పూట మాత్రమే ఇవ్వాలని వారు కోరుతున్నారు.
వేంపాడు సబ్‌స్టేషన్ పరిధిలో ఇబ్బంది పడుతున్న రైతులు