
వరి కోతలు వాయిదా వేసుకోవాలి
● రానున్న ఐదురోజులు వర్షాలు పడే అవకాశం
అనకాపల్లి టౌన్ : జిల్లాలో వచ్చే ఐదురోజులు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరక్టర్ డాక్టర్ సిహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్ష సూచన ఉన్నందున కోత దశలో ఉన్న వరి పైరుని కోయడం వాయిదా వేసుకోవాలని, ఒకవేళ ఇప్పటికే కోసి ఉంటే పనలను కుప్పలుగా వేసుకొని టార్పలిన్ కప్పి జాగ్రత్త చేసుకోవాలని అన్నారు. వర్షాలు అనంతరం 80 నుంచి 90 శాతం గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలన్నారు. అలాగే పూత దశలో ఉన్న నువ్వు పైరులో కాయ తొలుచు పురుగు అశించే అవకాశం ఉన్నదని, నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, చెరకు కార్సి చేసిన 45 రోజులకు ఎకరాకు 150 కిలోల యారియాను మెక్కల మెదల్ల దగ్గర చిన్న గుంతలు తీసి వేసుకోవాలని, మెక్కతోటలైతే 45, 90 రోజుల వయసు గల తోటల్లో ఎకరాకు 75 కిలోల యూరియాను మొక్కల మొదళ్ల దగ్గర చిన్న గుంతలు తీసి వేసుకోవాలన్నారు. రాగల వర్షాన్ని వినియోగించుకొని ఖాళీగా ఉన్న పొలాల్లో వేసవి లోతు దుక్కులు దున్నుకోవాలని ఈ విధంగా చేయడం వలన పురుగులు, తెగుళ్ల అవశేషాలు, కలుపు విత్తనాలు భూ ఉపరితలానికి చేరి అవి సూర్యరశ్మి ద్వారా నిర్మూలించబడతాయన్నారు. సమావేశంలో డాక్టర్ టి. శ్రీలత, డాక్టర్ కె.వి.రమణమూర్తి, డాక్టర్ వి.గౌరి పాల్గొన్నారు.