
భూ వివాదంలో కిరాయి వ్యక్తుల దౌర్జన్యం
● పోలీసులకు ఎ.కొత్తపల్లి బాధిత మహిళల ఫిర్యాదు ● ఐదుగురు వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌కు అప్పగింత
దేవరాపల్లి : పొలంలోకి వెళ్తున్న తమపై కిరాయి వ్యక్తులు దాడి చేశారని ఎ. కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్కరాజు దేముడమ్మ, కంచిపాటి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎ.కొత్తపల్లిలో 6.80 ఎకరాల భూమిని సుమారు 20 ఏళ్లగా సాగు చేస్తున్నామని, ఈ భూమికి సంబంధించి తమకు, వేరొకరికి కోర్టులో వివాదం నడుస్తుందన్నారు. ఈ భూమిపై తమకు స్టేటస్‌కో ఆర్డర్ కోర్టు ఇచ్చిందన్నారు. అయితే సింగందొరపాలేనికి చెందిన వెలగల పైడంనాయుడు సదరు భూమిని తాను కొనుగోలు చేశానని చెబుతూ తమపై తరచూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈనేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం పొలంలోకి వెళ్తుండగా విశాఖపట్నంకు చెందిన సుమారు 30 మంది కిరాయి వ్యక్తులు తమను అడ్డగించి దాడికి తెగబడ్డారని బాధిత మహిళలు ఆరోపించారు. దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్లకుంటే తమ వద్ద ఉన్న యాసిడ్‌తో దాడి చేస్తామని బెదిరించారని అన్నారు. సదరు కిరాయి వ్యక్తులను ఎవరని ప్రశ్నించగా తాము కె.కోటపాడు మండలం సింగందొరపాలెంకు చెందిన వెలగల పైడంనాయుడు తాలూకా అని, తమకు టీడీపీ పెద్ద నాయకుల సపోర్టు ఉందని చెప్పి బెదిరించారని బాధిత మహిళలు తెలిపారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో కొందరు పారిపోగా ఐదుగురిని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు అప్పగించామన్నారు. తమపై దౌర్జన్యాలకు దిగిన సదరు కిరాయి వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఇది ఇలా ఉండగా రెవెన్యూ రికార్డుల ఆధారంగా కొనుగోలు చేసిన భూమిలోకి వెళ్తుండగా తమపైనే ఎ.కొత్తపల్లికి చెందిన వారు దాడి చేశారని, ఇదే విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వెలగల పైడంనాయుడు తెలిపారు.