
ప్రైవేటు ఆస్పత్రులకు డెలివరీ కేసులు
● దారి మళ్లిస్తున్న ప్రభుత్వ సిబ్బందిపై కఠిన చర్యలు ● సమగ్ర విచారణకు స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆదేశం ● నర్సీపట్నంలో ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం
నర్సీపట్నం: ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేసిన డెలివరీ కేసులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు వైద్యాధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో మంగళవారం కలెక్టర్ విజయ కృష్ణన్ సమక్షంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తక్కువగా డెలివరీ కేసులు పంపించి, ప్రైవేటు హాస్పిటల్స్‌కు ఎక్కువ కేసులు తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గత ఏడాది 398, ఈ ఏడాది 498 డెలివరీ కేసులు నర్సీపట్నంలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాయని స్పీకర్ పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాతవరం పీహెచ్‌సీలోని ఫార్మసిస్ట్ జాగరాపు వెంకటరావుపై వస్తున్న ఫిర్యాదులపై డీఎంహెచ్‌వో 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. కనీసం మూడు నెలలకొకసారి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో జ్యోతిని ఆదేశించారు. సీఎస్‌ఆర్ గ్రాంట్ ద్వారా రూ.35 లక్షల విలువైన ఆధునిక అంబులెన్స్‌ను మంజూరు చేసిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోలార్ వేడి నీటి గ్రీజర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
త్వరలో పంచకర్మ సేవలు
ఏరియా ఆస్పత్రి ఆవరణలో రూ.29 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్మాణానికి సహకరించిన కలెక్టర్‌ను స్పీకర్ దంపతులు సత్కరించారు. ఈ హాస్పిటల్‌లో దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్య విధానంలో మందులు అందించనున్నట్లు తెలిపారు. చర్యవ్యాధులతో పాటు అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలోనే ఆయుర్వేద ఆస్పత్రిలో పంచకర్మ సేవలు ప్రారంభిస్తామన్నారు. అనంతరం విద్యార్ధుల యోగాసనాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసరావు, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద, డాక్టర్ యశోదదేవి, డాక్టర్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.