రాజయ్యపేట నిర్వాసితులకు పరిహారం ప్రకటించిన ఆర్డీవో | - | Sakshi
Sakshi News home page

రాజయ్యపేట నిర్వాసితులకు పరిహారం ప్రకటించిన ఆర్డీవో

Apr 17 2025 1:37 AM | Updated on Apr 17 2025 1:37 AM

రాజయ్యపేట నిర్వాసితులకు పరిహారం ప్రకటించిన ఆర్డీవో

రాజయ్యపేట నిర్వాసితులకు పరిహారం ప్రకటించిన ఆర్డీవో

● పరిహారం పెంచాలని డిమాండ్‌ చేసిన సీపీఎం నాయకులు

నక్కపల్లి : విశాఖ చైన్నె ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా రాజయ్యపేట సమీపంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌నిర్మాణంలో నివాస ప్రాంతాలు కోల్పోతున్న నిర్వాసితులకు రూ.8.36 లక్షల ప్రత్యేక ప్యాకేజీ, పెదబోదిగల్లం వద్ద ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందని నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణ తెలిపారు. బుధవారం ఆయన డీఎల్‌పురం, బోయపాడు, రాజయ్యపేట గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణలో నిర్వాసితులైన వారికి పూర్తి స్థాయిలో పరిహారం, ప్యాకేజీ చెల్లించిన తర్వాతే పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ మూడు గ్రామాల్లో ఇళ్లు, నివాస ప్రాంతాలు కోల్పోతున్నవారు 346 మంది ఉన్నారన్నారు. వీరందకి 2024 డిసెంబరు 31 తేదీని కటాఫ్‌ తేదీగా నిర్ణయించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఈ కటాఫ్‌ తేదీ ఆధారంగా 18 సంవత్సరాలు నిండిన వారితో అర్హులైన వారి జాబితా సిద్ధం చేశామన్నారు. 346 మందితో కూడిన జాబితా తయారు చేయడం జరిగిందన్నారు. వీరందరికీ రూ.8.36లక్షల నగదు సాయం, ఐదుసెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరందరికీ త్వరలోనే ప్యాకేజీ చెల్లించడం జరుగుతుందన్నారు. బోదిగల్లం వద్ద పునరావాసం కల్పించేందుకు భూసేకరణ చేస్తున్నామన్నారు. అక్కడ లేఅవుట్‌వేసి తాగునీరు సదుపాయం కల్పించి ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుందన్నారు. నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కరించిన తర్వాతే భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు ఈ సందర్భంగా సీపీఎం నాయకులు అప్పలరాజు, పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ నిర్మాణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్యాకేజీ పెంచాలని 18 ఏళ్లు నిండిన వారికి రూ.25 లక్షల చొప్పున చెల్లించాలన్నారు. బోయపాడు గ్రామానికి చెందిన నిర్వాసితులు మాట్లాడుతూ బల్క్‌డ్రగ్‌ పార్క్‌ కోసం గ్రామంలో సగం మందిని, ఇళ్లను ఖాళీ చేయించి మిగిలిన వాళ్లను వదిలేయడం కుదరదన్నారు. ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తే మొత్తం గ్రామాన్ని ఖాళీ చేయించి వేరొక చోట పునరావాసం కల్పించాలన్నారు. చేతి వృత్తుల వారికి కూలీలకు, దళితులు, మత్య్సకారులకు రూ.15 లక్షల చొప్పున ప్యాకేజీ చెల్లించాలన్నారు. నిర్వాసితుల డిమాండ్లను, వారి వినతులను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో అన్నారు. అర్హత కలిగి ప్యాకేజీ జాబితాలో పేర్లు లేనివారు వారం రోజుల్లో అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.నర్సింహమూర్తి, డీఎల్‌పురం సర్పంచ్‌ కె.రామకృష్ణ, ఎంపీటీసీ కనకారావు, మాజీ సర్పంచ్‌ లక్ష్మణరావు, మాజీ ఎంపీటీసీ రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement