
కెమికల్ మీద పడి కార్మికుడి మృతి
● ఎస్టార్ కెమికల్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
బుచ్చెయ్యపేట: పొట్ట కూటి కోసం పనికి వెళ్లిన యువకుడు కెమికల్ మీద పడి మృత్యువాత పడ్డాడు. బుచ్చెయ్యపేట మండలం నీలకంఠాపురానికి చెందిన పడాల హరినాథ్ (22) మంగళవారం గ్రామ యువకులతో కలిసి అచ్యుతాపురంలో గల ఎస్టార్ కెమికల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లాడు. దినసరి కార్మికుడిగా ప్రైవేటు కాంట్రాక్టర్ వద్ద చేరిన ఈ యువకుడు కెమికల్ ఖాళీ డబ్బులను లారీకి ఎక్కించుకుని పరవాడ వద్ద తుక్కు దుకాణం వద్ద అప్పగిస్తుంటాడు. ఆ క్రమంలో పరవాడలో తుక్కు ఇనుప కొట్టు వద్ద దించుతుండగా డబ్బా ఒకటి మూత ఊడిపోయి అందులో ఉండిపోయిన కెమికల్ శరీరంపై పడింది. దీంతో హరినాథ్ ఒళ్లంతా బొబ్బలెక్కి గాయాలై అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. అతన్ని వెంటనే కూర్మన్నపాలెంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్ధితి విషమంగా ఉండటంతో రాత్రికి విశాఖ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ హరినాథ్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పడాల కన్నంనాయుడు, రాజ్యలక్ష్మిలకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు దివ్యాంగుడు కావడంతో రెండో హరినాథ్‌ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. డిగ్రీ చేసి ఖాళీగా ఉండటంతో పది రోజులుగా హరినాథ్ గ్రామస్తులతో కలిసి అచ్యుతాపురం కూలీ పనులకు వెళ్లి వస్తున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎస్టార్ యాజమాన్యం శుభ్రపరచకుండా సరైన నిబంధనలు పాటించకుండా విషపూరితమైన కెమికల్ ఖాళీ డబ్బాలు నిర్లక్ష్యంగా తరలించడం వల్ల హరినాథ్ మృత్యువాత పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు, మిత్రులు ఆరోపిస్తున్నారు. హరినాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విశాఖ వెళ్లి ఎస్టార్ కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడంతో హరినాథ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ పూర్తికాక కేజిహెచ్‌లోనే ఉండిపోయింది. జెడ్పీటీసీ దొండా రాంబాబు, సర్పంచ్ పడాల నాగభూషణం, మాజీ సర్పంచ్ కోట సత్యనారాయణ విశాఖ వెళ్లి హరినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.