
డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
తుమ్మపాల : డీఎస్సీ ఉచిత శిక్షణ కొరకు జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి కె.రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అతిత్వరలో అందించబడుతుందని తెలియజేశారు. టెట్ అర్హత సాధించిన ఆసక్తి గల అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరడమైందన్నారు. అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం, నేటివిటీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, టెట్ పరీక్షలో అర్హత పత్రాలను జతపరచిన దరఖాస్తును వెనుకబడిన తరగతుల సంక్షేమం – సాధికారత అధికారి కార్యాలయం, డోర్ నెం.10–06–31/7, రఘురామకాలనీ, సర్వేపల్లి రాధా కృష్ణన్ జూనియర్ కాలేజీ స్ట్రీట్‌లో సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నెం.9885845743, 9494978777 సంప్రదించవలసినదిగా ఆమె కోరారు.
ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి అనిత
నక్కపల్లి : హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం సారిపల్లిపాలెంలోని తన స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, భూ సరిహద్దు సమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాల సమస్యలు పరిష్కరించాలని, స్వయం ఉపాధి కోసం రుణాలు ఇప్పించాలంటూ నాలుగు మండలాల నుంచి పలువురు అర్జీలు అందజేశారు. అర్జీలు పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పరిష్కరిస్తామన్నారు. సుమారు 600కు పైగా అర్జీలు వచ్చాయని తెలిపారు.