
ఫ్లైఓవర్ వద్దే వద్దు ..
● ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలి
● ముక్తకంఠంతో ఆర్‌డీవోకు అచ్యుతాపురం ప్రజల విజ్ఞప్తి
అచ్యుతాపురం రూరల్ : అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా మండల కేంద్రమైన అచ్యుతాపురం కూడలిలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్లై–ఓవర్ కోసం అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయిషా గురువారం స్థానికులతో సమావేశమయ్యారు. ఫ్లై–ఓవర్ నిర్మాణానికి ప్రజలు అంగీకరిస్తే నష్టపరిహారంగా టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. అయితే మాకు ఫ్లై–ఓవర్ వద్దు..రింగు రోడ్డు వేయండి అంటూ స్థానికులు ముక్తకంఠంతో చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో కాలుష్యం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా పరిశ్రమలను అనుసరించి అనేక రహదారులు ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రభుత్వ ఆస్తులు ఉన్నప్పటికీ కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అచ్యుతాపురం కూడలిని ఆనుకుని అచ్యుతాపురం, మోసయ్యపేట, ఇందిరమ్మకాలనీ, చోడపల్లి, బర్మాకాలనీ, భోగాపురం, కుమారపురం, కోనేంపాలెం ఇలా మరెన్నో గ్రామాల్లో వేలాది మంది ప్రజలు నివాసముంటున్న నివాస స్థలాల్లో రోడ్డు మీద రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం పెరుగుతుందే కానీ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. విశాఖ పోర్టు నుంచి వచ్చే వందలాది భారీ వాహనాలు పరిశ్రమలకు చేరుకోవడానికి అప్పన్నపాలెం కూడలి నుంచి జంగులూరు కూడలికి తరలించవచ్చునన్నారు. అలాగే యలమంచిలి హైవే నుంచి వచ్చే వాహనాలు కానీ అనకాపల్లి బైపాస్ నుంచి వచ్చే వాహనాలకు కూడా పరిశ్రమలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలో రహదారుల ప్రణాళిక ఉందని అధికారులకు గ్రామస్తులు గుర్తు చేశారు. గతంలో పరిశ్రమలకు భూములు ఇచ్చి నిర్వాసితులైన వారు వచ్చిన పరిహారంతో పూడిమడక రహదారిలో వసతి ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు మరోసారి అభివృద్ధి పేరుతో రోడ్ల వెడల్పు, ఫ్లై–ఓవర్ల నిర్మాణాలు చేస్తే ఎక్కడికి పోవాలని భవన యజమానులు అధికారులను నిలదీశారు.
ఫ్లైఓవర్ వద్దంటూ అనకాపల్లి ఆర్‌డీఓ షేక్ అయిషాకి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాజాన రమేష్ కుమార్, సన్యాసినాయుడు, సర్పంచ్ కూండ్రపు విమలా నాయుడు, సీపీఎం మండల కన్వీనర్ రాము, భవన యజమానుల సంఘం అధ్యక్షుడు దేశంశెట్టి అప్పలనాయుడు, గౌరవ అధ్యక్షుడు పల్లి శేషగిరిరావు తదితరులు ఉన్నారు.
కష్టార్జితం కాలుష్యం పాలేనా...
పదేళ్లు బయట దేశాల్లో కష్టపడి సంపాదించిన కష్టార్జితంతో కుటుంబంతో స్వగ్రామంలో ప్రశాంతంగా జీవించ వచ్చుననే ఉద్ధేశంతో నిర్మించుకున్న ఇల్లు ప్రస్తుతం కాలుష్యం బారిన పడుతుందని తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఇక్కడితో రోడ్డు వెడల్పు కాదు.. అని అధికారులు, నాయకులు చెప్పిన తరువాతే మా ఇంటి నిర్మాణం చేశాను. ఇపుడు ఫ్లై–ఓవర్ నిర్మిస్తే అంతకుఅంతా కాలుష్యం పెరిగి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలా ఎందరో మండల కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికై నా ఫ్లై–ఓవర్ ఆలోచన మానుకుని, ప్రత్యామ్నాయ రహదారులు నిర్మాణం చేయాలి.
– పచ్చిపులుసు వాసు, అచ్యుతాపురం
●

ఫ్లైఓవర్ వద్దే వద్దు ..