
హెవీలోడ్‌తో వెళ్తున్న లారీల పట్టివేత
నక్కపల్లి: టోల్ ఫీజును ఎగ్గొట్టేందుకు సామర్ధ్యానికి మించి బరువుతో వెళుతున్న రెండు లారీలను నక్కపల్లి పోలీసులు శనివారం పట్టుకున్నారు. బండరాళ్లతో రాజమండ్రి నుంచి రాంబిల్లి వెళ్తున్న లారీలు క్రషర్ బూడిదతో తిరిగి రాజమండ్రి వెళుతున్నాయి. ఒక్కొక్క లారీలో సుమారు 80 టన్నుల బరువు గల క్రషర్ వేస్ట్ లోడ్ చేశారు. జాతీయ రహదారిపై వేంపాడు వద్ద ఉన్న టోల్‌ప్లాజా మీదుగా వెళ్తే పరిమితికి మించి లోడ్ చేసినందుకు రూ.5 వేలకుపైనే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఈ పెనాల్టీ నుంచి తప్పించుకునేందుకు ఉపమాక, బోయపాడు, తమ్మయ్యపేట, అమలాపురం మీదుగా వేంపాడు చేరుకుని అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లేందుకు ఈ రెండు లారీలు శనివారం ఉదయం రాకపోకలు సాగిస్తుండగా ఉపమాక సర్పంచ్ ప్రగడ వీరబాబు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు ఈ రెండు లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటిని రవాణాశాఖ వారికి అప్పగించడం లేదా ఉన్నతాధికారుల సూచన మేరకు పెనాల్టీ విధించడం చేస్తామని సీఐ కుమారస్వామి తెలిపారు. కాగా ఈ లారీలను అడ్డదారుల్లో పంపించేందుకు నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో విలేకరులుగా చెలామణి అవుతున్న ముగ్గురు వ్యక్తులతోపాటు ఉపమాక పరిసర గ్రామాలకు చెందిన కొంతమంది కూటమి నాయకులు ఒప్పందం కుదుర్చుకుని సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.