
బుచ్చెయ్యపేటలో తప్పిన పెను ప్రమాదం
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేటలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. బుచ్చెయ్యపేటకు చెందిన పాతాళ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మంగళాపురం గ్రామంలో తమ బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో శనివారం ఉదయం మంగళాపురం నుంచి తిరిగి వస్తూండగా నేతవానిపాలెం దాటిన తరవాత బుచ్చెయ్యపేట దగ్గరలో ఎదురుగా నడిచి వస్తున్న వ్యక్తిని తప్పించబోయి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొన్నాడు. విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. కారు నుజ్జునుజ్జు అవగా అందులో ఉన్న నలుగురు వ్యక్తులతో పాటు ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. కొత్తగా వేస్తున్న విద్యుత్ స్తంభం అవడం విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ స్తంభాన్ని ఆనుకుని గ్రామానికి సరఫరా అవుతున్న విద్యుత్ స్తంభం సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫారం ఉంది. దీనిని ఢీ కొడితే మంటలు చెలరేగి పెద్ద ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. రోడ్డుపై పడ్డ విద్యుత్ స్తంభాన్ని స్థానికులు పక్కకు తొలగించి వాహనాల రాకపోకలు సాగేలా చేశారు.