
జాతీయ రహదారిపై హై అలెర్ట్
● ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ
నక్కపల్లి: కశ్మీర్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. జాతీయ రహదారిపై శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబుల ఆధ్వర్యంలో వేంపాడు టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తనిఖీలు నిర్వహించి, ఆధారాలు లేకపోతే అదుపులోకి తీసుకోవాలని ఎస్పీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అప్రమత్తమైనట్టు సీఐ తెలిపారు. తీరప్రాంత గ్రామాలను సైతం అలెర్ట్ చేశారు. దండోరా మూలంగా తెలియజేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.