పామిడి: ఈ నెల 10న స్థానిక రైలు పట్టాలపై వ్యక్తి మొండెం లభ్యమైన కేసులో మిస్టరీ వీడింది. ఇది ఆత్మహత్య కాదని, హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని పామిడి సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, గుత్తి రైల్వే పోలీసులు సంయుక్తంగా విచారణ చేస్తున్నారు.
ఏం జరిగింది?
ఈ నెల 10వ తేదీన పామిడిలోని ఎద్దులపల్లి రోడ్డు రైల్వేగేట్ ఎల్‌సీ 143 సమీపంలో ఓ వ్యక్తి మొండెం లభ్యమైంది. తల లేదు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కింద గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పామిడి సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, గుంతకల్లు రైల్వే సీఐ నగేష్‌బాబు నేతృత్వంలో ముమ్మర దర్యాప్తు సాగించిన జీఆర్పీ సిబ్బంది.. ఈ కేసులో మిస్టరీని ఛేదించారు.
హతుడు ఎవరు?
తొలుత పట్టాలపై తలలేని మొండెం లభ్యం కావడంతో ఈ కేసు దర్యాప్తు రైల్వే పోలీసులకు పెను సవాల్‌గా మారింది. జీఆర్పీ సీఐ నగేష్‌బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. మొండాన్ని కొద్ది దూరం వరకూ లాక్కొచ్చి అక్కడ పడేసినట్లుగా ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి... దర్యాప్తులో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన శంకర్‌నాయక్‌గా నిర్ధారించారు.
ఎందుకు హతమార్చారు?
శంకర్‌నాయక్ వడ్డీ వ్యాపారం సాగించేవాడిగా తెలుస్తోంది. ఈ క్రమంలో వడ్డీకి ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించని ఓ మహిళను లోబర్చుకుని తన శారీరక అవసరాలు తీర్చుకునేవాడు. ఈ విషయం శంకర్‌నాయక్ భార్యకు తెలిసి గొడవ చేయడంతో సదరు మహిళ తన పుట్టింటికి చేరుకుంది. అయినా శంకర్‌నాయక్ ఆమెను డబ్బు కోసం వేధిస్తూ వచ్చాడు. ఇదే అతని హత్యకు దారి తీసింది.
ఎలా చేశారు?
పామిడి మండలం రామగిరి గ్రామానికి చెందిన మంగల నారాయణ, నారాయణమ్మ దంపతుల రెండో కుమార్తె రాజేశ్వరి అలియాస్ రాజీని పదేళ్ల క్రితం జొన్నగిరికి చెందిన కేశవయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం కరోనా కారణంగా కేశవయ్య మృతి చెందాడు. ఆ సమయంలో కుటుంబ పోషణ భారం కావడంతో శంకర్‌నాయక్ వద్ద లక్ష రూపాయలను అప్పుగా రాజీ తీసుకుంది. ఈ అప్పు వసూలు చేసుకునే క్రమంలో ఆమెను శంకర్ నాయక్ లోబర్చుకుని శారీరక అవసరాలు తీర్చుకునేవాడు. ఏడాది క్రితం ఈ విషయం తెలుసుకున్న శంకర్‌నాయక్ కుటుంబసభ్యులు నిలదీయడంతో రాజీ ఆ గ్రామాన్ని విడిచి పుట్టింటికి చేరుకుని, వితంతువైన తన తల్లితో కలసి జీవిస్తోంది.
అయితే అప్పు పేరుతో ఆమెను శంకర్‌నాయక్ వెన్నాడడం వీడలేదు. తరచూ రామగిరికి వచ్చి రాజీని కలసి డబ్బు గురించి నిలదీస్తూ తన అవసరాలు తీర్చుకుని వెళ్లేవాడు. చివరకు శంకర్‌నాయక్ వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో ఎలాగైనా అతన్ని అడ్డుతొలగించుకోవాలని రాజీ, ఆమె తల్లి భావించారు. బాకీ డబ్బు ఇస్తామంటూ నమ్మించి శంకర్‌నాయక్‌ను రామగిరికి రప్పించిన రాజీ.. అనంతరం తన తల్లి నారాయణమ్మ సాయంతో ఈలకత్తి, కత్తులతో శంకర్‌నాయక్ గొంతుకోసి హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని తీసుకువచ్చి పట్టాలపై పడేసి వెళ్లారు. పక్కా ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే శంకర్ నాయక్ తల ఎక్కడుందనేది స్పష్టత రాలేదు. గొంతు కోసిన తర్వాత తల కొంచెం మొండెనికి అతుక్కొని ఉండగానే రైలు పట్టాలపై పడేసినట్లు పోలీసుల విచారణలో రాజీ తెలిపినట్లు సమాచారం. మాయమైన తల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment